ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక నిర్ణయం.. ప్రభుత్వానికి డెడ్ లైన్!!

 

ఆర్టీసీ సమ్మెకు అప్పుడే శుభం కార్డు పడేలా లేదు. ఇటు ప్రభుత్వం, అటు కార్మికులు మెట్టు దిగట్లేదు. దానికితోడు హైకోర్టు విచారణ రోజురోజుకి వాయిదా పడుతూ వస్తుంది. ఆర్టీసీ సమ్మె పిటిషన్ పై హైకోర్టులో ఈరోజు కూడా వాడీవేడీగా వాదనలు జరిగాయి. ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధమని ప్రభుత్వం తరఫున సీనియర్ కౌన్సిల్ విద్యాసాగర్‌ వాదనలు విన్పించారు. సమ్మె ఎస్మా పరిధిలోకి వస్తుందని చెప్పిన ఆయన.. ఆర్టీసీని 1998, 2015లో ఎస్మా పరిధిలోకి తీసుకొస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. గతంలో ఇచ్చిన జీవోలు ఇప్పుడెలా వర్తిసాయని ప్రశ్నించింది.  1998లో ఇచ్చిన ఉత్తర్వులు ఏపీఎస్‌ఆర్టీసీకే వర్తిస్తాయని.. 2015లో ఇచ్చిన ఉత్తర్వులు ఆరునెలల వరకే అమల్లో ఉంటాయని పేర్కొంది.

తాము కూడా చట్టానికి లోబడే పనిచేస్తామని హైకోర్టు చెప్పింది. చట్టానికి అతీతంగా తాము ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. ‘కొంత మంది సమ్మె చట్ట విరుద్ధమని ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నారు. కొంత మంది ఎస్మా ప్రయోగించేలా ఆదేశాలు ఇవ్వాలని  కోరుతున్నారు. మరికొంత మంది చర్చలకు పిలిచేలా ఆదేశాలు ఇవ్వమంటున్నారు. అసలు ఈ అంశం కోర్టు పరిధిలో ఉందో లేదో చెప్పట్లేదు. కోర్టు పరిధి దాటి మేము ఆదేశాలు ఇవ్వలేము’ అని హైకోర్ట్ స్పష్టం చేసింది. సమ్మెలో ఉన్న కార్మికులతో చర్చలు జరపాలని  ఏ ప్రాతిపదికన ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టు ప్రశ్నించింది. విచారణను రేపటికి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. అదేవిధంగా ఆర్టీసీ సమ్మె సమస్య పరిష్కారానికి ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేస్తామని హైకోర్టు పేర్కొంది. ఈ విషయమై ప్రభుత్వం అభిప్రాయం బుధవారంలోగా చెప్పాలని ఆదేశించింది.