ఆ టీకా తీసుకున్నవారిలో కరోనా ప్రభావం తక్కువే.. కన్ఫర్మ్ చేసిన తాజా పరిశోధన

టీబీ పై పోరులో భాగంగా ఇస్తున్న బిసిజి టీకా కరోనా సమయంలో కూడా సురక్షితమేనని తాజా అధ్యయనం తేల్చింది. ఈ టీకా వేయించుకున్న వారు కరోనా సోకినప్ప‌టికీ తీవ్ర అనారోగ్యం బారిన పడట్లేదని ప‌రిశోధ‌కులు గుర్తించారు. తాజాగా ఈ టీకా వేయించుకున్న వారితో పాటు టీకా వేయించుకోని వారిపై ప‌రిశోధ‌న‌లు చేసిన నెదర్లాండ్స్‌లోని రాడ్‌బౌడ్‌ యూనివర్సిటీ ప‌రిశోధ‌కులు తాము కనుగొన్న ఫ‌లితాలు వెల్ల‌డించారు. టీకా వేయించుకున్న వారు ఎక్కడ కూడా తీవ్రంగా అనారోగ్యం పాలైనట్లు త‌మ దృష్టికి రాలేదని వారు తెలిపారు. అంతే కాకుండా క‌రోనా బారిన పడే ముప్పును ఆ టీకా పెంచుతున్న పరిస్థితులు కూడా లేవని వారు తెలిపారు. క్షయ(టిబి) బారిన ప‌డ‌కుండా బీసీజీ టీకా వేస్తార‌న్న సంగతి తెలిసిందే. ఈ అధ్య‌య‌నంలో భాగంగా ఐదేళ్ల క్రితం బీసీజీ టీకా వేసుకున్న వారి ఆరోగ్య ప‌రిస్థితితో పాటు ఆ టీకా వేయించుకోని వారిని క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో ప‌రిశీలించామ‌ని ఆ శాత్రవేత్తలు వెల్ల‌డించారు. ఆ వాలంటీర్ల‌లో రోగ నిరోధక వ్యవస్థ పనితీరును ప‌రిశీలించి ఈ ఫ‌లితాలు చెబుతున్న‌ట్లుగా వారు వివ‌రించారు.