అసమ్మత మంత్రివర్గ సమావేశం నేడే!

 

మళ్ళీ మూడు నెలల విరామం తరువాత గురువారంనాడు రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం కాబోతోంది. సాధారణంగా మంత్రి వర్గం సమావేశం అంటే కీలక నిర్ణయాలు తీసుకోవడానికి, శాసనసభలో ప్రతిపక్షాలను ఏవిధంగా ఎదుర్కోవాలి వంటి విషయాలను చర్చించడానికి నిర్వహిస్తారు. కానీ, ఈ మద్య జరుగుతున్న సమావేశాలలో ప్రతిపక్షాలను ఎదుర్కోవడం సంగతెలా ఉన్నా, స్వపక్షంలో విపక్షాన్ని ఎదుర్కోవడంతోనే సరిపోతోంది.

 

గత సమావేశంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఆరోగ్యశాఖామంత్రి డా.డీయల్.రవీంద్రారెడ్డికి మద్య రెవెన్యు మంత్రి ధర్మాన ప్రసాదరావును సీబీఐ విచారణ నుండి మినహాయించడంపై పెద్ద యుద్ధమే జరిగింది. ఆరోజు మంత్రి వర్గంలో కేవలం డా.డీయల్.రవీంద్రా రెడ్డి ఒక్కరే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేఖంగా మాట్లాడారు. అయితే, ఈ సారి జరుగబోయే మంత్రివర్గ సమావేశంలో మంత్రులందరూ ఒకరిపై మరొకరు కత్తులు దూసేందుకు సిద్దంగా ఉన్నారు.

 

ఇటీవల జరిగిన సొసైటీ ఎన్నికల సందర్భంగా పార్టీ నేతల మద్యన జరిగిన ప్రచ్చన్న యుద్ధం, ఈ సారి సమావేశాన్ని రసాబాస చేసే అవకాశం ఉంది. కడప ఎన్నికలలో డా.డీయల్.రవీంద్రారెడ్డి, సి. రామచంద్రయ్య ఇద్దరూ పార్టీ వ్యతిరేఖ కార్యకలాపాలకు పాల్పడి, కాంగ్రెస్ అభ్యర్ధుల ఓటమికి కారకులయ్యారని, అందువల్ల వారిద్దరినీ పదవులలో తొలగించాలని శాసన సభ్యుడు వీరశివా రెడ్డి మరియు వరదరాజులు రెడ్డి ముఖ్యమంత్రిని కోరారు.

 

ఇక, సహకార ఎన్నికలలో తనని, తన అనుచరులను ఉద్దేశాపూర్వకంగానే ముఖ్యమంత్రి నిర్లక్ష్యం చేసారని, ఆయనకీ అందరినీ కలుపుకోనిపోయే అలవాటు లేదని మంత్రి రామచంద్రయ్య బహిరంగంగానే విమర్శించారు. ఇక, పీసీసి అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ 9మంది జగన్ వర్గీయులను పార్టీ నుండి బయటకి గెంటేస్తానని రంకెలువేయడం, దాని పర్యవసానాలతో కిరణ్ కుమార్ రెడ్డి ఆయనపై గుర్రుగా ఉన్నారు.

 

తనను పక్కన బెట్టి, సహకార ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించినందుకు బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రిపై కోపంతో రగిలిపోతున్నారు. ఇక, ఆంధ్రా మంత్రులు, తెలంగాణా మంత్రులు మద్య ఒకరినొకరు ద్వేషించుకోనేందుకు అవసరమయిన విభజన రేఖ వారి మద్యన ఎప్పుడూ ఉంది. వీటికి తోడూ తమ నెత్తి మీద కత్తిలా వ్రేలాడుతున్న అవిశ్వాస తీర్మానం కూడా ఉండనే ఉంది.

 

అందువల్ల ప్రజల సమస్యలపై నిర్ణయాలు, శాసనసభలో అనుసరించవలసిన వ్యూహం మొదలయిన విషయాల కంటే ముందు మంత్రుల మధ్య ఉన్న ఈ విబేధాలే సమావేశాన్ని కబళించే అవకాశం ఉంది. ఇది ఎలాగుందంటే కలిసి కాపురం చేయడానికి ఇష్టపడని మొగుడు పెళ్ళాలు, పొరుగింటి పిన్నమ్మ సంసారాన్ని చక్కబెట్టే ప్రయత్నంలా ఉంటుంది.

 

ముఖ్యమంత్రితో సహా మంత్రి వర్గం సమావేశంలో పాల్గొనబోతున్న మంత్రులందరికీ ఒకరితో మరొకరికి పడనప్పుడు, మరి వారు కలిసి కూర్చొని చర్చించేదేమిటో, సాదించేదేమిటో వారికే తెలియాలి.