మంత్రి వర్గ విస్తరణకి గంట కొట్టిన శ్రీనివాసరావు

 

మంత్రి డీయల్ బర్త్ రఫ్, టీ-కాంగ్రెస్ నేతలు పార్టీ విడిచిపోవడం వంటి అంశాలతో అల్లకల్లోలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో వేడిని చల్లార్చేందుకు మంత్రి గంట శ్రీనివాసరావు త్వరలో మంత్రి వర్గ విస్తరణ జరుగబోతోందని ప్రకటించారు. ఈ నెల 10నుండి మొదలయ్యే బడ్జెట్ సమావేశాల అనంతరం మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని ఆయన ప్రకటించారు. ఈ చల్లటి మాటతో కాంగ్రెస్ పార్టీలో నేతలందరూ అసమ్మతివాదుల గొడవ వదిలిపెట్టి మంత్రి పదవులు దక్కించుకోనేందుకు ప్రయత్నాలు ముమ్మురం చేస్తారు. ఈ ప్రయత్నంలో అందరూ ఒక్కసారిగా ముఖ్యమంత్రికి అనుకూలంగా మారే అవకాశం ఉంది గనుక అప్పుడు వారు డీయల్ రవీంద్ర రెడ్డి, దామోదర రాజానరసింహ, రామచంద్రయ్య వంటి వారి స్వరాలను వినబడకుండా చేసే అవకాశం ఉంది.

 

ఈ నెల పదిన జరగనున్న మంత్రివర్గ సమావేశం నాటికి ఈ విషయంలో కొంచెం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా సబితా ఇంద్రారెడ్డి ఖాళీ చేసిన హోం మంత్రి పదవికోసం పార్టీలో చాల మందే పోటీ పడుతున్నారు. వారిలో ముఖ్యంగా ఉపముఖ్యమంత్రి దామోదర రాజానరసింహ, బొత్స సత్యనారాయణ ముందున్నారు. అయితే ముఖ్యమంత్రి వారిరువురికీ కూడా ఆ పదవి ఇవ్వకుండా మోకాలు అడ్డుపెడుతూ, తనకి విదేయులయిన మంత్రులలో ఎవరో ఒకరికి ఆ పదవి కట్ట బెట్టాలని ప్రయత్నిస్తున్నారు. మంత్రి వర్గ విస్తరణతో బాటు, మార్పులు చేర్పులు కూడా జరిగే అవకాశం ఉంది. రామచంద్రయ్య వంటి వారిని మరింత అప్రదాన్యమయిన పదవులలోకి పంపించి, దానిలో తనకు విదేయులయిన వారిని నియమించుకొనే అవకాశం ఉంది.