సీట్లు మహాకూటమికి.. సీఎంగా కేసీఆర్

 

తెలంగాణలో డిసెంబర్ 7 న ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. అసెంబ్లీ రద్దుకి ముందు వరకు 'వార్ వన్ సైడ్' మళ్ళీ టీఆర్‌ఎస్సే అధికారంలోకి వస్తుందని అంతా భావించారు. కానీ కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ పార్టీలు కలిసి మహాకూటమిగా ఏర్పడటంతో ఆ అంచనాలు తారుమారయ్యాయి. అధికారం కోసం టీఆర్‌ఎస్‌ వర్సెస్ మహాకూటమి పోరు నువ్వానేనా అన్నట్టుగా మారింది. కొందరైతే మహాకూటమిదే పైచేయి అని భావించారు. తాజాగా ఓ సర్వే కూడా అదే తేల్చింది.

ఏబీపీ న్యూస్‌ కోసం సీ-వోటర్‌ చేసిన సర్వేలో తెలంగాణలో మహాకూటమిదే విజయమని తేలింది.  కాంగ్రెస్‌- టీడీపీ కూటమికి 33.9 ఓట్ల శాతంతో 64 సీట్లు, టీఆర్‌ఎస్‌ కు 29.4 శాతం ఓట్లతో 42 సీట్లు వస్తాయని అంచనా వేసింది. బీజేపీకి 4, ఇతరులకు 9 సీట్లు దక్కనున్నట్లు సర్వే తెలిపింది. ఇక సీఎం అభ్యర్థి విషయానికి వస్తే సర్వేలో పాల్గొన్నవారిలో అత్యధికులు కేసీఆర్‌ వైపే మొగ్గు చూపారు. మొత్తం 42.9 శాతం మంది కేసీఆరే సీఎం కావాలని కోరుకోగా.. 22.6 శాతం మంది జానారెడ్డి వైపు మొగ్గు చూపారు.. 7.2% మంది రేవంత్‌ రెడ్డి సీఎం అయితే బాగుంటుందన్నారు. దీనిబట్టి చూస్తుంటే తెలంగాణలో కేసీఆర్‌కు వ్యక్తిగతంగా ప్రజాదరణ ఉన్నా, ఎన్నికల లెక్కలు మాత్రం మహాకూటమికి అనుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది.

అయితే ఈ సర్వే పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహాకూటమి ఇంకా సీట్ల సర్దుబాటు దగ్గరే ఉంది. అభ్యర్థులను ప్రకటించలేదు. అభ్యర్థులను ప్రకటించిన తరువాత కూటమి నుంచి రెబెల్స్ వచ్చే అవకాశముంది. దీనివల్ల ఓట్లు చీలుతాయి. అది టీఆర్‌ఎస్‌ కు కలిసిరావొచ్చు. ఫలితాలు మారొచ్చు. మరి కూటమి వీటిని అధిగమించి టీఆర్‌ఎస్‌ ని ఓడించి సర్వే ఫలితాలను నిజం చేస్తుందేమో చూడాలి.

సీ-ఓటర్‌ సర్వే తెలంగాణతోపాటు ఎన్నికలు జరుగనున్న మిగతా రాష్ట్రాల్లో కూడా సర్వే నిర్వహించింది. ఆ రాష్ట్రాల్లో కూడా సర్వే ఫలితాలు కాంగ్రెస్ కి సానుకూలంగా ఉన్నాయి. రాజస్థాన్‌ లో బీజేపీ 39.7 శాతం ఓట్లతో 45 సీట్లకే పరిమితం కాగా.. కాంగ్రెస్‌ 47.9 ఓట్ల శాతంతో 145 సీట్లు కైవసం చేసుకోనుందని సర్వే తేల్చింది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు తప్పదని సీ-ఓటర్‌ సర్వే చెప్పింది. అయితే, చివరికి గెలుపు మాత్రం కాంగ్రెస్‌దేనని తేల్చింది. ఈ సర్వే ప్రకారం మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ 42.3% ఓట్లతో 116 సీట్లు, బీజేపీ 41.5% ఓట్లతో 107 సీట్లు గెలుచుకుంటుందని తేల్చింది. ఛత్తీస్‌గఢ్‌ విషయానికొస్తే బీజేపీకి 43 సీట్లు.. కాంగ్రెస్ కి 41 సీట్లు రావచ్చని అంచనా వేసింది. అయితే ఛత్తీస్‌గఢ్‌ లో ఓటు శాతం మాత్రం కాంగ్రెస్ కే ఎక్కువ వస్తుందని తేల్చింది. కాంగ్రెస్‌కు 42.2 శాతం, బీజేపీకి 41.6 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. ఇక మిజోరంలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాదని తేలింది. మిజో నేషనల్‌ ఫ్రంట్‌ 17 సీట్లతో ముందంజలో ఉండగా, కాంగ్రెస్‌కు 12, జోరం పీపుల్స్‌ మూమెంట్‌కు 9 సీట్లు దక్కనున్నాయని తెలిపింది.