ప్రమాదకరంగా మారిన ఆర్టీసి తాత్కాలిక డ్రైవర్లు...

 

తెలంగాణాలోని ఆర్టీసి కార్మికుల సమ్మె నేపథ్యంలో సర్కార్ నియమించిన తాత్కాలిక డ్రైవర్ లు ప్రమాదకరంగా మారారు. అనుభవం లేని వారు స్టీరింగ్ లు పట్టి ప్రమాదాలకు కారణమవుతున్నారు. తాజాగా కూకట్ పల్లి లో హైదరాబాద్ టూ డిపోకి చెందిన రసూల్ అనే డ్రైవర్ కూకట్ పల్లి వై జంక్షన్ దగ్గర ఏపీఎస్ ఆర్టీసీ బస్సును ఢీకొట్టాడు. దీంతో షాక్ కి గురైన ప్రయాణికులు తాత్కాలిక డ్రైవర్ పై విరుచుకుపడ్డారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తున్నాడు అంటూ తాత్కాలిక డ్రైవర్ పై దాడికి దిగారు దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. హైదరబాదు టు డిపోకు చెందిన బస్సు దిల్ సుఖ్ నగర్ నుంచి బయల్దేరి పరిగి వెళుతోంది. అయితే వై జంక్షన్ దగ్గరకు రాగానే బస్సు ముందున్న ఏపీఎస్ ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. తాత్కాలిక డ్రైవర్ మద్యం సేవించాడని బస్సు లో ఉన్న ప్రయాణికులు చెబుతుంటే రసూల్ మాత్రం తాను మద్యం తాగలేదని వాదిస్తున్నాడు. 

ఇదిలా ఉంటే నల్గొండ జిల్లా హాలియాలో ఆర్టీసీ బస్సు ప్రయాణికుడి కాలు మీద నుంచి వెళ్ళింది. దీంతో ప్రయాణికుడి పాదం మొత్తం నుజ్జునుజ్జైంది, అతనిని నల్గొండ ఆస్పత్రికి తరలించారు. నల్గొండ చైతన్య పురి కాలనీ కి చెందిన చంద్ర కాంత్ హాలియాకు వెళ్లాడు, బస్టాండ్ లో బస్ దిగుతుండగా డ్రైవర్ ఆపకుండా ముందుకు తీసుకు వెళ్ళిపోయాడు. ఈ క్రమంలో బస్సు టైర్ చంద్ర కాంత్ పాదం మీద కెక్కింది. దీంతో చంద్ర కాంత్ కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు చంద్ర కాంత్ ను ఆస్పత్రికి తరలించారు, ప్రస్తుతం అతనికి చికిత్స అందిస్తున్నారు. తాత్కాలిక డ్రైవర్ బస్సు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగింది అని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. డ్రైవర్ కి ఏమాత్రం అనుభవం లేదని బస్సు దిగుతున్న సమయంలో ఆపకుండా ముందుకు తీసుకు వెళ్ళాడంటున్నారు. డ్రైవర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.