జనసేనాని ఎక్కడ... ఏం చేస్తున్నాడు.. ఏం చేయాలనుకుంటున్నాడు..?

2018-19 ఆర్ధిక సంవత్సరానికి గానూ కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి మొండిచేయే మిగిల్చింది. ఎన్‌డీఏ చివరి బడ్జెట్‌లో కనీసం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అయినా ఏపీకి ఏమైనా సాయం చేస్తారని అందరూ భావించారు. కానీ ప్రజల ఆశలపై కేంద్రం నీళ్లు చల్లడంతో.. అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అధికార బీజేపీతో పొత్తు పెట్టుకుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ కేంద్రాన్ని పల్లెత్తు మాట అనడం లేదు.. ఆదివారం కోర్ కమిటీ మీటింగ్ పెట్టి బడ్జెట్‌‌పై చంద్రబాబు స్పందిస్తారని వార్తలు వస్తున్నాయి. 

 

తమ ముఖ్యమంత్రిని ఎన్ని అవమానాలకు గురిచేసినా సరే.. ఇన్నాళ్లు ఓపికగా భరిస్తూ వచ్చామని.. ఇక ఉపేక్షించి లాభం లేదనే అభిప్రాయానికి టీడీపీ ఎంపీలు వచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చాలా వరకు ఎన్డీఏతో తెగదెంపులు చేసుకునే అవకాశాలే ఉన్నాయని జరుగుతున్న పరిణామాలను బట్టి చెప్పవచ్చు. మరోపక్క ఎన్‌డీఏలో భాగస్వామి కాకపోయినప్పటికీ అన్‌అఫీఫియల్ పార్టనర్‌గా గుర్తింపు తెచ్చుకున్న వైసీపీ.. కేంద్రం దగ్గర కుస్తీలు పడుతూనే దానిని కప్పిపుచ్చుకోవడానికి రాష్ట్రంలో నిరసనలకు.. ధర్నాలకు పిలుపునిచ్చింది. ఇక కాంగ్రెస్, వామపక్షాల సంగతి సరేసరి.. పోరాడినా.. పోరాడకపోయినా.. వచ్చేది లేదు.. పోయేది లేదన్నది ఆయా పార్టీల ఆలోచన.. కాకపోతే విమర్శిస్తే మంచిదని ఒక ప్రెస్ మీట్ పెట్టి మోడీని ఏకీపారేశాయి.

 

ఇక తెలుగువాడికి అన్యాయం జరిగితే సహించేది లేదంటూ పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్‌ ఏమైపోయాడోనని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. మాట్లాడితే నిజాయితీ.. నైతికత వంటి పెద్ద పెద్ద మాటలు చెబుతూ.. నాలుగేళ్ల ప్రస్థానంలో ఆయనలో కనిపించనివే ఇవి. గత ఎన్నికలకు ముందు పవన్ ఏం చెప్పాడు..? ప్రశ్నించడమే పని కదా.. ఈ నాలుగేళ్లలో నాలుగైదు సార్లు జనాల ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ ప్రశ్నించింది ఏమిటీ..? శూన్యం.. కేంద్రంలో బీజేపీ.. రాష్ట్రంలో టీడీపీ ఇచ్చిన ఎన్నికల హామీల అమలుకు పూచీ తనది అని చెప్పిన పవర్‌స్టార్.. ఇప్పుడు పత్తా లేకుండా పోయాడు.

 

నిన్న మొన్నటి వరకు మోడీ.. చంద్రబాబు సేవలో తరించిన పవన్ కళ్యాణ్ లిస్ట్‌లోకి తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చి చేరారు. ఇద్దరు చంద్రులకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ.. వారికి దన్నుగా నిలుస్తున్నారని ఇప్పటికే విమర్శలు మూటకట్టుకున్న పవన్.. బడ్జెట్ లాంటి కీలక అంశంపై పాటిస్తోన్న వ్యూహాత్మక మౌనం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. వివాదాలు సాగిపోయి.. అంతా చప్పబడిపోయాకా తీరిగ్గా ఓ ట్వీట్ చేస్తారని గుర్తింపు తెచ్చుకున్న పవన్.. ఇప్పుడు అదే సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నాడంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ఈ సంగతి పక్కనబెడితే... వారం, పదిరోజులుగా ఏపీ, తెలంగాణల్లో "చలోరే చలోరే చల్" అంటూ యాత్ర చేసి అలసిపోయిన పవన్‌ కళ్యాణ్.. తర్వాత ఏం చేయబోతున్నాడన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.