హలో బ్రదర్! అని కలవరిస్తున్న బీజేపీ!

 

జగన్ మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన కొత్తలో కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీలు తప్ప రాష్ట్రంలో అన్ని చిన్న పెద్ద పార్టీలు కూడా అయన పార్టీతో చేతులు కలపాలని చూసాయి. ముఖ్యంగా మతతత్వ పార్టీలుగా ముద్రపడిన మజ్లిస్ మరియు భారతీయ జనతా పార్టీలు అయనకి స్నేహ హస్తం అందించాయి. జగన్ గనుక ఖచ్చితమయిన తెలంగాణా వైఖరిని ప్రకటిస్తే తెరాస కూడా అయన పార్టీతో పోత్తులకు సిద్దమని సంకేతాలు పంపింది.

 

కానీ, సరయిన రాజకీయ అనుభవం లేని కారణంగా, తగిన సలహాలు ఇచ్చే రాజకీయ అనుభవజ్ఞులు కూడా పార్టీలో లేకపోవడంతో జగన్ మోహన్ రెడ్డి తనకు తోచినదారిలో ముందుకు సాగిపోతూ చిక్కుల్లో పడ్డాడు. భారతీయ జనతా పార్టీతో సంబంధాలు పెట్టుకోనని ఆయన తెగేసి చెప్పినపటికీ, రాజకీయాలలో తలపండిన ఆ పార్టీ తొందరపడలేదు. ఎన్నికలకి ఇంకా చాల సమయం ఉనందున, అప్పటికి ఆయన ఆలోచనలో మార్పు రావచ్చని బీజేపీ ఓపికగా ఎదురుచూసింది.

 

కానీ, కాంగ్రెస్ పార్టీ నుండి అకస్మాత్తుగా తలాకులు చెప్పుకొని మజ్లిస్ పార్టీ విడిపోవడంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఆకస్మాతుగా మారిపోయింది. మజ్లిస్ కాంగ్రెస్ పార్టీ నుండి విడిపోతూ కిరణ్ కుమార్ రెడ్డి కంటే జగనే మంచోడు అని ఒక సర్టిఫికేట్ జారీ చేయడం, ఆతరువాత అక్బరుద్దీన్ అరెస్ట్ సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మౌనం వహించడం, క్రమంగా ఆ రెండు పార్టీలు దగ్గరవుండటంతో భారతీయ జనతా పార్టీ ఇక జగన్ మోహన్ రెడ్డి తమ చేజారిపోయినట్లేనని గ్రహించింది.

 

తమకు బద్ద విరోధి అయిన మజ్లిస్ పార్టీతో చేతులు కలుపుతున్నజగన్ మోహన్ రెడ్డిని ఇక ఎంత మాత్రం ఉపేక్షించనవసరం లేదని భావించిన వెంటనే, అంతవరకూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కనబడని తప్పులు బీజేపీకి స్పష్టంగా కనబడటం మొదలయ్యాయి. అంతే! ఆనాటి నుండి బీజేపీకి నేత ప్రభాకర్ బ్రదర్..బ్రదర్ అంటూ బ్రదర్ అనిల్ వెంటపడటం మొదలుపెట్టారు. ఆయనకి చెందిన ఆస్తులు, వివిధ సంస్థలలో ఆయన పెట్టిన పెట్టుబడులు, ఆయన సంస్థల పేర్లు, ఆయా సంస్థలలో ఆయన బినామీల పేర్లు, ఆయన చేసిన భూభాగోతాలు అన్నిటినీ ఒకటొకటిగా ప్రస్తావిస్తూ ఆయనపై దాడి తీవ్రతరం చేసారు.

 

బీజేపీకి తన దాడుల పరిధిలోకి జగన్ మోహన్ రెడ్డితో సహా ఆయన కుటుంబ సభ్యులందరినీ తెచ్చే అవకాశం ఉన్నపటికీ, ఆ పార్టీ సహజంగా మతానికి ప్రాధాన్యం ఇస్తుంది గనుక, మతప్రచారం చేస్తూ, మతమార్పిడులకు ప్రోత్సాహం పలుకుతున్న బ్రదర్ అనిల్ నే తన ప్రధాన లక్ష్యంగా చేసుకొంది. అయితే, మున్ముందు ఏర్పడే రాజకీయవాతావరణాన్ని అనుసరించి బీజేపీ తన దాడుల పరిధి మరింత పెంచి మొత్తం జగన్ కుటుంబ సభ్యులను, ఆయన పార్టీని, నేతలపై యుద్ధం ప్రకటించవచ్చును.

 

బీజేపీని మతతత్వ పార్టీగా ముద్ర వేసి దూరం పెట్టిన జగన్ మోహన్ రెడ్డి, ఇప్పుడు మజ్లిస్ వంటి పార్టీతో ఏవిధంగా చేతులు కలుపుతున్నారని బీజేపీ ప్రశ్నిస్తోంది. అదే సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నికల తరువాత జాతీయ స్థాయిలో కేవలం సెక్యులర్ పార్టీతోనే చేతులు కలుపుతామని ప్రకటించడంతో, బీజేపీ మరింత మండిపడింది. ఆనాటి నుండి బీజేపీ క్రమంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై తన దాడి తీవ్రతరం చేసింది. కానీ, బీజేపీ రాష్ట్ర శాఖా అద్యక్షుడు కిషన్ రెడ్డి మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేఖంగా ఇంకా ఎందుకో నోరు విప్పలేదు. బహుశః ఆయనకీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంకా ఆశలు ఏమయినా మిగిలిపోయాయేమో మరి తెలియదు.

 

ఒకవైపు తెలుగుదేశం పార్టీ చేస్తున్న దాడులను తిప్పి కొట్టేందుకు సతమతమవుతున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి, ఇప్పుడు బీజేపీ కూడా తోడవడంతో తట్టుకోవడం కష్టంగా మారింది. తమ పార్టీ అధినేత జైల్లో ఉండటంవల్లనే బలహీనంగా ఉన్నామని అందరికీ అలుసుగా మారామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బాధపడుతోంది. కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడి రధం భూమిలోకి క్రుగిందని అర్జునుడు జాలిపడిఉంటే భారతగాధ మరో విధంగా ఉండేది. గనుక, ఇప్పుడు రాష్ట్ర రాజకీయ రణరంగంలో కూడా ఎవరూ ఎవరిపైనా జాలిపడే పొరపాటు చేయరు.