అవును "నేను" దొంగనే..!

సర్వ దరిద్రాలకు నిలయంగా..ప్రపంచాన్ని వణికించిన మారణహోమాలకు వేదికగా..తీవ్రవాదులకు స్వర్గధామంగా పాకిస్థాన్‌కు అంతర్జాతీయ గుర్తింపు ఉంది. ఒక దొంగ తాను దొంగని అని ఒప్పుకోని విధంగానే పాకిస్థాన్ కూడా అంతే..లోకం మొత్తం ఆ దేశాన్ని ఓ ఉగ్ర స్థావరంగా చెబుతున్నా..ఛ, ఛ మేమా..? అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతూ తప్పును కప్పిపుచ్చుకోవటానికి సర్వదా శతధా ప్రయత్నిస్తూనే ఉంటుంది. కానీ కాలం ఎప్పుడూ చూస్తూ ఊరుకోదు కదా..! ఎప్పటికైనా తప్పును ఒప్పుకోక తప్పదు కదా..! ఇప్పుడు పాక్ విషయంలోనూ అలాగే జరిగింది. నిషేధిత ఉగ్రవాద సంస్థలు లష్కర్-ఏ-తోయిబా, జైషే మొహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలు తమ భూభాగం నుంచే కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నాయని ఎట్టకేలకు ఆ దేశం ఒప్పుకొంది.

 

ఇది ఎవరో చెప్పిన మాట కాదు..సాక్షాత్తూ ఆ దేశ విదేశాంగశాఖ మంత్రి ఖాజ్వా అసీఫ్‌ మీడియా సాక్షిగా చెప్పిన మాట. అంతర్జాతీయంగా ప్రతీ దేశం ఉగ్రవాది అంటే పాక్ పౌరుడే అన్నట్లు చూస్తుండటం..మొదటి నుంచి వెన్ను దన్నుగా నిలిచిన అమెరికా తను చేస్తున్న సాయానికి కత్తెర వేయడం..బెస్ట్ ఫ్రెండ్ చైనా కూడా వెనకడుగు వేస్తూ ఉండటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో పాకిస్థాన్‌ ఏళ్లుగా కప్పిపుచ్చుకుంటూ వస్తోన్న నిజాన్ని ఒప్పేసుకుంది. మొత్తంగా ఒప్పేసుకుంటే లేనిపోని కష్టాల్లో ఎదుర్కోవాల్సి వస్తుందనుకున్నారో ఏమో కానీ అసీఫ్ తెలివిగా వ్యవహరించారు.  అంతర్జాతీయంగా నిషేధానికి గురైన ఆ సంస్థలు పాక్ నుంచే పనిచేస్తున్నాయని అయితే తమ ప్రభుత్వం కూడా వాటిని నిషేధించిందని..గత మూడేళ్లుగా ఆ ఉగ్రసంస్థలను నిర్వీర్యం చేయడానికి తమ సైనికులు గట్టిగా పోరాడుతూనే ఉన్నారంటూ వ్యాఖ్యానించారు.

 

తరతరాలుగా సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తోన్న పాకిస్థాన్‌ ప్రపంచాన్ని వణికించిన అనేక దారుణ మారణకాండకు కారణమైంది. ఉన్నత విద్యను అభ్యసించడానికి వేరే దేశానికి వెళ్లినట్లు..ఉగ్రవాదంలో పీహెచ్‌డీ చేయాలంటే పాకిస్థాన్‌ వెళ్లాల్సిందే అన్నంతగా ఆ దేశానికి ముద్రపడిపోయింది. ముష్కర మూకకి శిక్షణా శిబిరాలు నిర్వహించడం ఒక ఎత్తైతే..ఇతర దేశాల్లో విధ్వంసం సృష్టించి వచ్చిన వారికి ఆశ్రయం కల్పించడం మరో ఎత్తు. 1993 ముంబై వరుస పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం పాక్‌లోనే ఉన్నాడని భారత్ ఎన్నో ఏళ్లుగా అనేక ఆధారాలిచ్చినా..కరాచీలోని అడ్రస్‌తో సహా బయటపెట్టినా పాక్ పట్టించుకున్న పాపానపోలేదు. 2001లో అమెరికాలోని ట్వీన్ టవర్స్‌ను కూల్చేసి ప్రపంచాన్ని గడగడలాడించిన అల్‌ఖైదా అధినేత బిన్‌లాడెన్‌‌ను అంతమొందించడానికి భూగోళాన్ని జల్లెడ పట్టింది అమెరికా. చివరకి 2011లో అబోట్టాబాద్‌లో జరిగిన ఆపరేషన్‌లో అగ్రరాజ్య కమెండోలు బిన్‌లాడెన్‌ను కాల్చి చంపాక కానీ అతను పాక్‌లోనే ఉన్నాడని నిజం ప్రపంచానికి తెలిసింది. లాడెన్ ఐదేళ్లపాటు తమ దేశంలోనే జీవించాడంటే తానే నమ్మలేకపోయానని ముషారఫ్ నమ్మబలికినప్పటికీ నాడు ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే లాడెన్ పాక్‌లో ఆశ్రయం పొందాడని అర్ధమవుతోంది.

 

ఇన్ని చేసినప్పటికీ పాక్ తను చేస్తోన్న పాపాన్ని ఒప్పుకోవడం లేదు. పేదరికం, ఆర్థిక అసమానతలపై కలిసికట్టుగా పోరాడాలని ఉగ్రవాదానికి దేశాన్ని స్థావరంగా మార్చవద్దంటూ భారత్ పలుమార్లు పాక్‌కు సూచించినప్పటికీ అది పెడచెవిన పెడుతూనే వస్తుంది. తాను పెంచి పోషిస్తోన్న ఉగ్రభూతం తమనే సర్వనాశనం చేస్తున్నప్పటికీ పాక్ ప్రభుత్వం కానీ..ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ఆర్మీలో కానీ ఎలాంటి మార్పు లేదు. తాజాగా చైనాలో జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో భాగంగా సభ్యదేశాలు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ముక్త కంఠంతో ఖండించాయి. అందులోనూ ఎప్పుడూ సోపోర్ట్ చేసే చైనా కూడా చేతులేత్తేయడంతో పాక్ తప్పును ఒప్పుకోకతప్పలేదు. అయితే పాక్‌ను నమ్మడానికి లేదు. అది బయటకి చెప్పేది ఒకటి..చేసేది మరోకటి..ఈ విషయం ఎన్నోసార్లు రుజువైంది. ఆ దేశంలో ఉగ్రవాదుల హింస ఎక్కువైతే తప్ప పాకిస్థాన్‌కు బుద్ధిరాదు. అప్పుడు కానీ తత్త్వం బోధ పడదు.