టిఫిన్ కి నాగా పెడుతున్నారా?

 

ఉరుకులు పరుగుల జీవితం. పొద్దున లేచిన దగ్గర్నుంచి పొద్దుపోయేవరకూ ఉరుకులూ పరుగులు. టైమ్ కి ఆఫీస్ కెళ్లాలి. పిల్లల్ని స్కూల్ కి పంపించాలి. త్వరత్వరగా తెమలాలి. ఎంత తొందరగా లేచినా రోజూ లేటైపోతోంది. జీవితమంతా గాభరా.. ఇంత హడావుడిలో పడితే ఎవరికి మాత్రం టిఫిన్ తినాలనిపిస్తుంది చెప్పండి.

టైమ్ కి ఆఫీస్ కెళ్లాలన్న ధ్యాసలో పడపోయి చాలామంది పొద్దున్నే టిఫిన్ తినడం మానేస్తున్నారు. ఆలస్యంగా లేచే అలవాటున్న పిల్లలుకూడా టిఫిన్ తినకుండానే రోజూ స్కూల్ కెళ్లిపోతున్నారు. దీంతో పొద్దున్నే కడుపులో ఎసిడిటీ. మంటని తగ్గించుకోవడానికి తర్వాత వీలు చిక్కినప్పుడల్లా పొట్టలో ఏదో ఒకటి పడేయడం.

దానివల్ల ఎసిడిటీ మరింతగా పెరగడం.. చక్రం తిరిగీ తిరిగీ ఇలాగే రోజులు గడిచిపోవడం. సవ్యంగా ఉన్న జీర్ణ వ్యవస్థని మనంతటమనమే దెబ్బకొట్టుకోవడం.. మామూలైపోయాయ్. కనీసం డెబ్భైశాతం కుటుంబాల్లో స్థిమితంగా కూర్చుని టిఫిన్ చేసే అలవాటు పూర్తిగా కనుమరుగైపోతోందని సర్వేలు చెబుతున్నాయ్. రెండు వేల మందిని ప్రశ్నిస్తే ఈ విషయాలు బైటికొచ్చాయ్.

లండన్ మాత్రం చాలామంది ఇలాంటి దురలవాటు తమ పాలబడకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారట. ఎంత ఆలస్యమైనా తప్పని సరిగా టిఫిన్ చేసే బైటికి బయలుదేరాలని గట్టిగా నిర్ణయించుకున్నారట. అవునుమరి.. హెల్త్ ఈజ్ వెల్త్ అన్న సంగతి మనకంటే వాళ్లకే ఎక్కువగా తెలుసినట్టుంది.