ఇలా చేస్తే మీ ఎముకలు భద్రం

 

ఎముకలు లేని మనిషి మాంసపు ముద్దతో సమానం. అతనికి ఒక ఆకారాన్ని ఇచ్చి, ఆ ఆకారాన్ని నడిపించే బాధ్యత ఎముకలదే! 30 ఏళ్ల వరకూ ఎముకల పెరుగుదల వేగంగా ఉంటుంది. ఎముకలు నానాటికీ బలాన్ని పుంజుకుంటాయి. అప్పటివరకూ ఎముకలు తగినంతగా ఎదిగేందుకు అవసరమయ్యే పోషకాలను శరీరానికి అందించాల్సి ఉంటుంది. ఇక 30 ఏళ్ల తరువాత ఎముకల ఎదుగుదల కంటే తరుగుదలే అధికంగా ఉంటుంది. అప్పుడు వాటిని కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ జాగ్రత్తలు ఇవీ...

 

 

ఎముకలు = కాల్షియం

ఎముకల ప్రస్తావన వచ్చే ప్రతిసారీ కాల్షియం గురించి చెప్పుకోక తప్పదు. ఎముకల ఎదుగుదలకీ, రక్షణకీ కూడా కాల్షియం చాలా అవసరం. అందుకే మన శరీరానికి అందే కాల్షియంలో 90 శాతం ఎముకలకే సరిపోతుందట. వయసు పెరిగే కొద్దీ ఎముకలు బోలుగా మారిపోయి త్వరగా విరిగిపోయే ‘ఆస్టియోపొరోసిస్‌’ అనే ప్రమాదాన్ని కూడా కాల్షియం నివారిస్తుంది. అందుకే కాల్షియం సమృద్ధిగా ఉండే పాలపదార్థాలు, ఆకుకూరలు, బీన్స్, సోయాపాలు వంటివి పుష్కలంగా తీసుకోవాలి.

 

 

విటమిన్‌ డి

మనం ఎంత పోషకాహారాన్ని తీసుకున్నా... వాటిలోని కాల్షియాన్ని శరీరం గ్రహించాలంటే విటమిన్‌ డి అవసరం. అయితే ఈ విటమిన్‌ చేపలు, జున్ను, గుడ్డు వంటి కొన్ని పదార్థాలలోనే ఉంటుంది. అందుకనే ఈ మధ్య నూనె, పాలు వంటి పదార్థాలకు కృత్రిమంగా డి విటమిన్‌ను చేరుస్తున్నారు. ఈ బాధలన్నీ పడే బదులు విటమిన్‌ డిని సహజంగా, సమృద్ధిగా ఇచ్చే సూర్యకాంతి కింద కాసేపు తిరగడం మేలు.

 

వ్యాయామాలు

పరుగులెత్తడం, జాగింగ్‌ చేయడం, టెన్నిస్‌ ఆడటం, డాన్స్ చేయడం... ఇలా ఎముకల మీద ఒత్తిడి కలిగించే వ్యాయామాలు చేయడం వల్ల అవి దృఢపడతాయంటున్నారు నిపుణులు. పైగా శరీరానికి తనని తాను అదుపు చేసుకునే క్షమత కూడా పెరుగుతుందని సూచిస్తున్నారు. అయితే ఆస్టియోపోరోసిస్‌ వంటి సమస్యలు ఉన్నవారు నడక, ట్రెడ్‌మిల్‌ వంటి వ్యాయామాలతో సరిపెట్టుకుంటే మంచిదని సూచిస్తున్నారు.

 

 

కాఫీ, సిగిరెట్, మద్యం దూరం

కాపీలో ఉండే కెఫిన్‌ మన శరీరం కాల్షియంను గ్రహించేందుకు అడ్డుపడుతుందని పరిశోధనలు రుజువుచేస్తున్నాయి. ఇక విపరీతంగా మద్యం సేవించడం డి విటమిన్‌ పనితీరుని దెబ్బతీస్తుందనీ తేలింది. సిగిరెట్లు తాగడం వల్ల కూడా ఎముకలు పెళుసుబారిపోతాయని హెచ్చరిస్తున్నారు.

 

అవసరమైతే మందులు తప్పదు

వయసుని బట్టి మనకు రోజువారీ 1000 నుంచి 1200 మిల్లీగ్రాముల వరకూ కాల్షియం అవసరం అవుతూ ఉంటుంది. దీనికి దాదాపు 1000 IUల వరకూ విటమిన్‌ డి కూడా జోడించాల్సి ఉంటుంది. ఇవి మన రోజువారీ జీవితంలో తగినంతగా అందుతున్నాయో లేదో తేల్చుకునేందుకు ఒకసారి వైద్యుడిని సంప్రదించడం మంచిది. సదరు వైద్యుని సలహా మేరకు అవసరం అనుకుంటే కాల్షియం, డి విటమిన్లను మందుల రూపంలో తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా రుతుక్రమం నిలిచిపోయిన స్త్రీలు, 60 ఏళ్లు దాటిన పెద్దలు, వంశపారంపర్యంగా ఆస్టియోపోరోసిస్‌ సమస్య ఉన్నవారు తమ ఎముకల ఎంతవరకూ దృఢంగా (Bone Density) ఉన్నాయో ఒక్కసారి పరీక్ష చేయించుకోవడం చాలా అవసరం.

 

- నిర్జర.