నోరేసుకుని పడిపోవడమే మంత్రి పదవికి అర్హతా? బోండాపై కార్యకర్తల ఫైర్‌

 

2014 ఎన్నికలకు ముందు బోండా ఉమా ఎవరో కనీసం అతని నియోజకవర్గ ప్రజలకు కూడా తెలియదు. మూడేళ్ల క్రితం వరకూ బోండా సెకండ్‌ లీడర్‌ మాత్రమే. అలాంటి గల్లీ లీడర్‌ను చంద్రబాబు వెలుగులోకి తెచ్చారు, 2014లో టికెట్‌ ఇచ్చి ప్రోత్సహించడమే కాకుండా, విజయవాడ సెంట్రల్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. అంతేకాదు అనేక సమయాల్లో బోండాకి అండగా ఉంటూ వచ్చారు. అలాంటిది మంత్రి పదవి దక్కకపోయేసరికి అధినేతనే బ్లాక్‌‌మెయిల్‌ చేసే స్థితికి వచ్చాడు. ప్రతీదానికీ నోరేసుకుని పడిపోతూ గూండాయిజం చేసే బోండా ఉమా... ఎమ్మెల్యేగా గెలవడంతో, ఇదంతా తన బలమేనని అతిగా ఊహించుకున్నాడు. తెలుగుదేశం లేకపోతే తాను జీరో అనే సంగతి మరిచిపోయాడు. బ్రాహ్మణుల ఓట్లు అధికంగా ఉండే విజయవాడ సెంట్రల్‌‌లో పార్టీ బలంతో ఎమ్మెల్యేగా గెలిచి, పదవి రాకపోయేసరికి కాపు కులాన్ని తెరపైకి తెచ్చాడు.

 

తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఉంటూ, ఐదారుసార్లు ఎమ్మెల్యేలైన వాళ్లకే మంత్రి పదవులు రావడం లేదు. అలాంటిది ఫస్ట్‌ టైమ్‌ ఎమ్మెల్యే అయిన బోండా మంత్రి ఆశించడం ఎంతవరకు న్యాయం, ఒకవేళ ఆశపడ్డా, మంత్రి పదవి రాకపోతే పార్టీకి అధినేతకు ఇబ్బంది కలిగించేలా మాట్లాడటమేనా?. ప్రతీదానికీ కులాన్ని తెరపైకి తేవడం, ఆశించింది దక్కకపోతే తమ కులానికి అన్యాయం చేశారంటూ మాట్లాడటం కామన్‌ అయిపోయింది. ఫస్ట్‌ టైమ్‌ ఎమ్మెల్యే అయిన బోండా ఉమాకి మంత్రి పదవి ఇవ్వకపోతే... కాపు కులానికి  అన్యాయం జరిగినట్లేనా? నిన్నటివరకూ కాపులకు చంద్రబాబు న్యాయం చేస్తున్నారంటూ మాట్లాడిన నోటితోనే, కాపుల గొంతు కోశారంటే పోయేది బోండా ఉమ పరువే కానీ, పార్టీకి ఏమీకాదు. ప్రత్యర్ధి పార్టీలపై నోటికొచ్చినట్లు మాట్లాడితే సంతోషించారు కదా అని, సొంత పార్టీపైనే ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తే అధినేతే కాదు, కార్యకర్తలు కూడా సహించరు. బోండా ఉమా తన గూండాయిజం... పార్టీపైనే చూపిస్తే తోకలు కత్తిరించడం ఖాయం.

 

బోండా ఉమాకి మంత్రి పదవి ఇవ్వకపోతే కాపు కులానికే అన్యాయం చేసినట్లా? అయినా బోండా ఉమాకి ఏం అర్హతులున్నాయని మంత్రి పదవి ఇవ్వాలి. నోరేసుకుని పడిపోవడమే మంత్రి పదవికి అర్హతా? . కొడుకు కార్ రేసింగులతో స్నేహితుల ప్రాణాలు తీయడమే ఎలిజిబులిటీయా? గూండాయిజం, భూకబ్జాలు చేయడమే అర్హత. సీనియర్‌ ఐపీఎస్ అధికారులను ఇష్టమొచ్చినట్లు తిడుతూ, ఆర్టీఏ అధికారులపై దాడులు చేసినందుకు మంత్రి పదవి ఇవ్వాలా? విజయవాడ సెంట్రల్‌లో బ్రాహ్మణుల ఓట్లతో గెలిచి, చివరికి వాళ్లనే బెదిరిస్తూ, భూములు కబ్జా చేస్తున్నందుకు పదవి ఇవ్వాలా? కనీసం పదో తరగతి కూడా చదువుకోని నీకు... అందరిపై నోరేసుకుని పడిపోతున్నందుకు మంత్రి పదవి ఇవ్వాలా? లేక కులం పేరుతో బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నందుకు ఇవ్వాలా? అంటూ తెలుగుదేశం నేతలు, కార్యకర్తలే ప్రశ్నిస్తున్నారు.

 

స్క్రాప్‌ బిజినెస్‌, చెత్త అమ్ముకునే బోండా ప్రవర్తన కూడా చెత్తగానే ఉందంటున్నారు కార్యకర్తలు. అతని మాటలు, బుద్ధి చెత్తగా, చీప్‌గా ఉన్నాయంటున్నారు. నోరుంది కదా అని అదే అర్హత అనుకుంటే ఎలా అంటున్నారు. కనీసం పక్క జిల్లా వాళ్లకు కూడా నువ్వు తెలియదు, ఆ మాటకొస్తే పక్క నియోజకవర్గం కాపులకు కూడా నువ్వెవరో తెలియదు, అలాంటి నీకు మంత్రి పదవి ఇవ్వకపోతే 13 జిల్లాల్లోని కాపులు బాధపడ్డారా? అనడానికైనా సిగ్గుండాలి అంటున్నారు. ఏదిపడితే అది మాట్లాడుతూ కులం పేరుతో చంద్రబాబునే బ్లాక్‌మెయిల్‌ చేస్తావా? అంటూ బోండా ఉమాపై కార్యకర్తలు మండిపడుతున్నారు. తనకు మంత్రి పదవి ఇవ్వనందుకు 13 జిల్లాల్లో  కాపులు బాధపడ్డారని, చంద్రబాబు కాపుల గొంతు కోశారన్న బోండా మాటలు విని, కాపులే నవ్వుకుంటున్నారని, బోండా ఆ విషయం తెలుసుకోవాలని అంటున్నారు.

 

నోరేసుకుని పడిపోవడమే మంత్రి పదవికి అర్హత కాదని, సౌమ్యులు, సమర్ధులు, నాన్‌ కాంట్రవర్శియల్స్‌కి మంత్రి పదవులు దక్కుతాయనే సంగతి బోండా పోయినట్లున్నారు. చినరాజప్ప, నారాయణ, గంటా, మాణిక్యాలరావు కాపులు కాదా? వాళ్లు మంత్రులుగా లేరా? కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలతో సమానంగా కాపులకు మంత్రి పదవులు కట్టబెట్టలేదా? ఇవన్నీ వదిలేసి, తనకు మంత్రి పదవి రాకపోయేసరికి, కాపులకేదో అన్యాయం జరిగిపోతున్నట్లు విపక్షాలు విమర్శలు చేసినట్లు మాట్లాడితే, పోయేది బోండా ఉమా పరువే కానీ, తెలుగుదేశం పార్టీది కాదు.