బాబు, జగన్ అప్రమత్తంగా ఉండాలి... బోండా ఉమ కీలక వ్యాఖ్యలు

 

భార్యను పేదరికంలో పరీక్షిస్తే... కష్టకాలంలో సహకరిస్తుందో లేక కాల్చుకు తింటుందో తేలిపోతుందని అంటారు. ఇక మనం దుఖంలో ఉన్నప్పుడే బంధువులను, స్నేహితులను, సన్నిహితులను పరీక్షించాలని, అప్పుడే ఎవరు హితులో... ఎవరు స్నేహితులో అర్ధమవుతుందని చెబుతారు. ఇలా చెప్పుకుంటూ పోతే... మనిషి మనస్తత్వం... కష్టకాలంలోనే బయటపడుతుంది. రాజకీయాలకు వచ్చినా ఇదే సూత్రం వర్తిస్తుంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడే... నిజమైన విధేయులెవరో తెలుస్తుంది. 2014 ఎన్నికల తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇది బోధపడింది. 2019 ఎన్నికల తర్వాత ఇప్పుడు చంద్రబాబు పూర్తిగా అర్ధమవుతోంది. 

అయితే, రాజకీయాల్లో పార్టీలు మారడం అత్యంత సహజమే అయినా, కొందరు నేతలు వెళ్లిన తీరు, చేసిన విమర్శలు గుర్తుండిపోతాయి. అయినా కూడా పరస్పర రాజకీయ అవసరాల కోసం ఆయా పార్టీల అధినేతలు రాజీ పడుతూ ఉంటారు. అందుకే, చంద్రబాబు, జగన్ ఎవరూ అతీతులు కారు. కానీ, ఏ పార్టీ అధినేత అయినా, కొందరు లీడర్లపై గట్టి నమ్మకం పెట్టుకుంటారు. అలాంటి నేతలు పార్టీని వీడినప్పుడు, ఘాటు విమర్శలు చేస్తున్నప్పుడు తట్టుకోవడం కష్టంగా ఉంటుంది. 2019 ఎన్నికలకు ముందు ఆ పరిస్థితిని జగన్ ఎదుర్కొంటే... ఇప్పుడదే పరిస్థితిని చంద్రబాబు ఎదుర్కొంటున్నారు. అయితే, అది ఇంకా ప్రాథమిక స్థాయిలోనే ఉంది. ముందుముందు ఇది ఇంకా తీవ్రంగా ఉండబోతోంది. అయితే, ఇలాంటి లీడర్ల విషయంలో అటు జగన్... ఇటు చంద్రబాబు ఇద్దరూ అప్రమత్తంగా ఉండాలి.

అయితే, ప్రస్తుతం టీడీపీలో పరిస్థితిపై బోండా ఉమ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో స్ర్కాప్ బయటికి వెళ్లిపోతోందని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అన్నీ అనుభవించి, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వదిలేసి వెళ్తున్నారని మండిపడ్డారు. ఇలా పార్టీలు మారుతున్న వాళ్లకు సిద్ధాంతాల కంటే అధికారమే ముఖ్యమని బోండా ఉమ ఫైరయ్యారు. రేపు మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తే... మళ్లీ తెలుగుదేశంలో చేరి సొంత గూటికి వచ్చామంటారని అన్నారు. అధికారాన్ని బట్టి పార్టీలు మారే నేతల విషయంలో ఇఫ్పటికైనా చంద్రబాబు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇప్పుడు వైసీపీ పచ్చగా ఉందని వెళ్తున్న నేతలంతా, ఎండటం మొదలుకాగానే మళ్లీ బయటికి వచ్చేస్తారని, అలాంటి లీడర్లను జగన్ కూడా నమ్మొద్దన్నారు.