అమీర్ పేట్ లో బాంబు కలకలం !

దేశ, విదేశాల్లో జరిగే ఉగ్రవాద దాడుల మూలాలు హైదరాబాద్‌లో తేలుతున్నట్లు వార్తలు వస్తుండటం, ఉగ్ర దాడుల కుట్రలు, ప్లానింగ్‌ హైదరాబాద్‌ కేంద్రంగా జరుగుతుండటం అత్యంత ఆందోళనకరమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి కొద్ది రోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. గతంలో అనేక పర్యాయాలు ఉగ్రదాడులకు గురైన హైదరాబాద్ నగరంలో ఇప్పటికీ ఉగ్రసంచారంపై అనుమానాలు తొలగిపోలేదు. 

దానికి తోడు కేంద్ర హోం శాఖా మంత్రి అయిన ఆయన మాటలకి జనం ఇంకాస్త బెంబేలు ఎత్తుతారు. తాజాగా అమీర్ పేట్ మెట్రో స్టేషన్ వద్ద చోటుచేసుకున్న ఓ పరిణామమే అందుకు నిదర్శనం. అమీర్ పేట స్టేషన్ మెట్రో పిల్లర్ వద్ద ఓ పెయింట్ డబ్బా అందరినీ భయాందోళనలకు గురిచేసింది. ఎవరో వదిలేసి వెళ్లిన ఆ పెయింట్ డబ్బా కొన్ని గంటల పాటు అక్కడే ఉండడంతో పలువురు అనుమానం వ్యక్తం చేశారు. అది బాంబు అయ్యుండొచ్చని ఆందోళన చెందడంతో డాగ్ స్క్వాడ్, బాంబు డిస్పోజల్ స్క్వాడ్ రంగంలోకి దిగి ఆ పెయింట్ డబ్బాను క్షుణ్ణంగా పరిశీలించాయి. అందులో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని నిర్ధారించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.