బ్లడ్‌ గ్రూప్‌ బట్టి గుండెపోటు!

 

వినడానికి చిత్రంగా ఉంది కదా. కానీ లక్షలమందిని పరిశీలించిన తరువాతే ఈ మాట చెబుతున్నామంటున్నారు శాస్త్రవేత్తలు. నెదర్లాండ్స్‌కు చెందిన టెస్సా అనే పరిశోధకురాలు తేల్చిన ఈ వివరం ఇప్పుడు వైద్యలోకంలో సంచలనం సృష్టిస్తోంది.

 

గుండెజబ్బులకీ బ్లడ్‌గ్రూపుకీ ఏ మేరకు సంబంధం ఉందో తెలుసుకునేందుకు ఏకంగా పదమూడు లక్షలమందిని పరిశీలించారు. ఇందులో myocardial infarction, coronary artery disease, ischaemic heart disease, heart failure వంటి గుండె సమస్యలు ఉన్నవారిని బ్లడ్‌ గ్రూప్ ఆధారంగా విభజించారు. వీరిలో O గ్రూప్ రక్తం ఉన్నవారితో పోలిస్తే ఇతర బ్లడ్ గ్రూప్‌ ఉన్నవారిలో గుండె సమస్యలు దాదాపు 9 శాతం ఎక్కువగా ఉన్నట్లు తేలింది.

 

O గ్రూప్ రక్తం వారికీ, ఇతరులకీ మధ్య ఇంత వ్యత్యాసం ఉందన్న విషయం మీద ఇంకా పరిశోధనలు జరగాల్సి ఉంది. అయితే ఇప్పటికే రెండు కారణాలని ఊహిస్తున్నారు.

 

- O గ్రూప్ కాని వ్యక్తులలో von Willebrand అనే ప్రొటీన్‌ ఉత్పత్తి ఎక్కువగా ఉంటుందట. ఈ ప్రొటీను వల్ల రక్తం త్వరగా గడ్డకడుతుంది. ఏదన్నా గాయం అయినప్పుడు ఇలా రక్తం గడ్డకట్టడం మంచిదే అయినా... కొన్ని సందర్భాలలో అది గుండెపోటుకి దారితీసే ప్రమాదం ఉంది.

 

- A గ్రూప్‌ రక్తంవారిలో ఉండే కొన్ని జన్యువుల వల్ల, వారిలో కొలెస్టరాల్‌ పేరుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందట. ఇలా కొలెస్టరాల్‌ పేరుకోవడం వల్ల గుండె ధమనులు పూడుకుపోతాయన్న విషయం తెలిసిందే కదా!

 

- O గ్రూపు కాని వ్యక్తులలో galectin-3 అనే ప్రొటీన్‌ ఉత్పత్తి కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది శరీర భాగాలలో వాపుని (inflammation) నియంత్రిస్తుంది. ఈ ప్రొటీన్‌ కారణంగా గుండెజబ్బులు ఉన్నవారిలో సమస్యల మరింత తీవ్రతరమైపోతుందట.

 

మొత్తానికి O గ్రూప్ వారితో పోలిస్తే ఇతరులు కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు పరిశోధకులు. ఇక మీదట వైద్యులు కూడా తమ దగ్గరకి వచ్చే రోగులకి చికిత్స చేసేటప్పుడు వారి బ్లడ్‌ గ్రూప్‌ని దృష్టిలో ఉంచుకోవాలని చెబుతున్నారు.

- నిర్జర.