ఇలా చేస్తే మీ రక్తపోటు తగ్గిపోతుంది

 

రక్తపోటు మనకి రోజువారీ బంధువు. బీపీ సమస్యతో బాధపడే వారు ఇప్పుడు ఇంటికి ఒకరు కనిపిస్తున్నారు. పోషకాహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం వంటి మార్పులతో రక్తపోటుని అదుపులో ఉంచుకోవచ్చునని నిపుణులు చెబుతున్నారు. నిజమే! కానీ ఈ మార్పులని నిత్యం పటించేది ఎవరు. ఒకవేళ ఆ విషయాలని నెట్లో నట్టింట్లో నిత్యం గుర్తుచేస్తూ, ప్రోత్సహిస్తూ ఉంటే ఎలా ఉంటుంది? అన్న ఆలోచన వచ్చింది కొందరికి...

American College of Cardiologyకి చెందిన నిపుణులకి ఓ ఆలోచన వచ్చింది. రక్తపోటుతో బాధపడుతున్న రోగులని వెబ్సైటు ద్వారా దిశానిర్దేశం చేస్తే ఎలా ఉంటుంది? అన్నదే సదరు ఆలోచన. ఇందుకోసం వారు 57 సంవత్సరాల వయసున్న ఓ 264 మంది అభ్యర్థులను ఎన్నుకొన్నారు. వీరిలో అంతా 140/90 నుంచి 160/100 రక్తపోటు ఉన్నవారే! అభ్యర్థులందరికీ కూడా ఒక ఏడాది పాటు ఆరోగ్యానికి సంబంధించిన మెయిల్స్ పంపించారు. అయితే ఇలా మెయిల్స్ చేయడంలో ఒక తేడాని పాటించారు. కొంతమంది అభ్యర్థులకి రక్తపోటు, గుండెజబ్బులకి సంబంధించిన విశేషాలతో పాటుగా... వాటిని అదుపులో ఉంచేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జీవనశైలిలో ఎలాంటి మార్పులు చేయడం మంచిది? వంటి సాధారణ వివరాలను అందించారు. ఇవన్నీ కూడా తరచూ మనకి వెబ్సైట్లలో కనిపించేవే. మరికొందరికి మాత్రం ఇంకాస్త జాగ్రత్తగా రూపొందిన మెయిల్స్ అందించారు. వీటిలో భాగంగా రకరకాల విశ్లేషణలు, సలహాలు, సందేహాలకు సమాధానాలు పొందుపరిచారు. రక్తపోటుతో బాధపడుతున్న వ్యక్తుల అనుభవాలు, విజయగాథలతో కూడిన వీడియోలను కూడా వీరికి అందించారు. అలాగే అభ్యర్థులు తమ జీవనశైలిలో ఎలాంటి మార్పులను తీసుకువస్తున్నారు, వారి ఆహారంలో ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తున్నారో నిరంతరం ఫీడ్ బ్యాక్ను అందించాల్సి ఉండేది. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ అభ్యర్థులకు పంపిన మెయిల్స్ ఒక కౌన్సిలింగ్ రూపంలో సాగాయి. అందుకనే వీటికి e-Counseling అని పేరు పెట్టారు.

ఒక ఏడాది గడిచిన తరువాత తాము మెయిల్స్ పంపిన అభ్యర్థుల రక్తపోటులో ఏమన్నా మార్పు వచ్చిందేమో గమనించారు పరిశోధకులు. ఆశ్చర్యకరంగా వారి రక్తపోటులో గణనీయమైన తగ్గుదల కనిపించింది. సాధారణ మెయిల్స్ స్వీకరించిన వ్యక్తుల రక్తపోటు 6 పాయింట్లు తగ్గితే, e-Counseling పొందిన అభ్యర్థుల రక్తపోటు 10 పాయింట్లు తగ్గింది. ఒక్కమాటలో చెప్పాలంటే రక్తపోటుకి మందు వేసుకుంటే ఎంత ప్రభావం ఉందో, e-Counseling వల్ల అంత ప్రభావం కనిపించింది.

ఎక్కడో e-Counseling వల్ల రక్తపోటు తగ్గితే మనకేంటి ఉపయోగం అనుకోవడానికి లేదు. రక్తపోటుకి సంబంధించి ఏదో సాధారణ విషయాలు చదువుతూ ఉండిపోకుండా... ఎప్పటికప్పుడు వాటిని జీవితానికి అన్వయిస్తూ, మనలో వచ్చిన మార్పుని ఎప్పటికప్పుడు బేరీజు వేస్తూ ఉంటే అద్భుతమైన మార్పులు సాధ్యమని ఈ పరిశోధనతో తెలిసిపోతోంది.

- నిర్జర.