రక్తపోటు గురించి కొత్త విషయాలు

 

ఇవాళా రేపట్లో అధిక రక్తపోటు అనేది సాధారణం అయిపోయింది. మారుతున్న జీవనశైలి వల్లనో లేకపోతే ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరగడం చేతనో... ఇప్పుడు ఎవరిని కదిపినా రక్తపోటు గురించి తెగ కబుర్లు చెప్పేస్తున్నారు. ఇంకా మాట్లాడితే భయపెట్టేస్తున్నారు. కానీ నిజానికి రక్తపోటును అదుపులో ఉంచుకోవడం ఏమంత బ్రహ్మవిద్య కాదంటూ మధ్యమధ్యలో కొన్ని నివేదికలూ స్పష్టం చేస్తున్నాయి. AARP అనే ఒక వైద్య పరిశోధనా పత్రిక ఇటీవల ప్రచురించిన ఒక నివేదికే ఇందుకు ఉదాహరణ. వాటిలో ముఖ్య అంశాలు ఇవిగో....

 

చిన్నపాటి వ్యాయామం:  చేతితో నొక్కే చిన్నపాటి వ్యాయామ పరికరం ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడే మనకు కనిపిస్తోంది. ఈ HAND GRIPPER తో వ్యాయామం చేస్తే దాదాపు 10 శాతం రక్తపోటు తగ్గిపోతుందట. ఈ విషయాన్ని నిరూపించేందుకు 2013లో ఒక పరిశోధన కూడా జరిగిందని చెబుతోంది AARP. దీని ప్రకారం చేతికి ఒత్తిడి కలిగించే ఈ వ్యాయామాన్ని రెండు నిమిషాల చొప్పున పావుగంట పాటు... వారానికి మూడుసార్లు చేస్తే కనుక రక్తపోటులో గణనీయమైన మార్పులు వస్తాయట. బహుశా రక్తపోటుని నివారించుకునేందుకు ఇంతకంటే చవకైన సులువైన ఉపాయం దొరకదేమో!

 

రక్తపోటు అనివార్యం:  చాలామంది, ముఖ్యంగా 50 ఏళ్లు దాటిన పెద్దవారు రక్తపోటు వచ్చిందనగానే కంగారుపడిపోతూ ఉంటారు. నిజానికి వయసుతో పాటుగా రక్తపోటు పెరగడం సహజమే అంటోంది AARP నివేదిక. వయసు పెరిగేకొద్దీ మన రక్తనాళాలు గట్టిపడిపోతాయనీ, దీనివల్ల మన రక్తపోటులో హెచ్చుతగ్గులు కనిపిస్తాయని చెబుతోంది. అందుకే మన పెద్దలు 100+ మన వయసుని రక్తపోటు కోసం పరిగణలోకి తీసుకునేవారని గుర్తుచేస్తోంది.

 

శ్వాసలో మార్పు తెస్తే:  రక్తపోటు కనుక ఎక్కువగా ఉందని అనిపిస్తే ఊపిరిని కాస్త నిదానంగా పీల్చమని చెబుతోంది AARP. మన శ్వాసని కనుక నిమిషానికి 12 సార్లకు తగ్గించగలిగితే తాత్కాలికంగా అయినా రక్తపోటు తగ్గుముఖం పడుతుందని వివరిస్తోంది. ఇలా చేయడం వల్ల మన రక్తపోటులో అప్పటికప్పుడు ఒక మూడు పాయింట్ల తగ్గుదల కనిపించే అవకాశం ఉందట!

 

మందుల విషయంలో జాగ్రత్త!  రోజువారీ జలుబు, నొప్పులకు వాడే మందులు కూడా రక్తపోటు మీద ప్రభావం చూపించే అవకాశం ఉందంటున్నారు. సాధారణంగా మనం ఇలాంటి సమస్యలకు దగ్గరలో ఉన్న మందుల షాపుకి వెళ్లిపోయి ఏ మందు ఇస్తే ఆ మందుని వాడేస్తూ ఉంటాము. కానీ ఒకోసారి ఇవే మన రక్తపోటు మీద ప్రతికూలంగా వ్యవహరించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి రక్తపోటు ఉన్నవారు సాధారణ ఆరోగ్య సమస్యల వచ్చినప్పుడు ఏ మందులు తీసుకోవచ్చునో ముందుగానే తమ వైద్యుని దగ్గర తెలుసుకుని ఉండమని సూచిస్తున్నారు.

 

నాలుక చేసే మోసం:  రక్తపోటు ఉన్నవారు వీలైనంత తక్కువ ఉప్పుని తీసుకోవాలన్న సూచనలు తరచూ వినిపించేవే! కానీ ఇందులో మరో కోణం కూడా ఉందట. వయసు పెరిగే కొద్దీ, నాలుకలో రుచిని గ్రహించే శక్తి తగ్గిపోతుందనీ... కాబట్టి చాలామంది పెద్దలు తాము ఎంత ఉప్పుని తీసుకుంటున్నామో తెలియని అయోమయంలో ఉంటారనీ AARP విశ్లేషిస్తోంది. పైగా బేకరీ వంటి పదార్థాలు రుచిగా ఉండటానికీ, అందులో విచ్చలవిడిగా వాడే ఉప్పే కారణం అని చెబుతున్నారు. కాబట్టి వయసు మీరుతున్న ఉప్పు విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.


- నిర్జర.