లోపం లేని మనిషి

ఒక ఊరిలో జనమంతా కలిసి తమకి ఇష్టమైన దేవుని శిల్పాన్ని ప్రతిష్టించాలనుకున్నారు. అందుకోసం చుట్టుపక్కల అంతా వాకబు చేసి ఒక శిల్పిని రప్పించారు. శిల్పి వచ్చీరాగానే తన పనిని ప్రారంభించాడు. శిల్పం కోసం సరైన శిలను ఎన్నకున్నాడు. ఊరి ప్రజల అభీష్టాన్నీ అనుసరించి వారి ఇష్టదైవాన్ని ఆ శిల్పంలో తొలవడం మొదలుపెట్టాడు. రోజులు గడిచాయి. రోజులు వారాలుగా మారాయి. వారాలు కాస్తా రెండు నెలలయ్యాయి. శిల్పి చెక్కుతున్న శిల్పం తుదిరూపుకి చేరుకుంది. కానీ మనసులో ఏం తోచిందో ఏమో కానీ, ఒక రోజున ఆ శిల్పాన్ని కాస్తా పక్కనపెట్టేశాడు శిల్పి. విగ్రహాన్ని చెక్కే పనిని మళ్లీ మొదటినుంచి మొదలుపెట్టాడు.


ఒక రోజు శిల్పిని వెతుక్కుంటూ అతని స్నేహితుడు వచ్చాడు. దీక్షగా విగ్రహాన్ని చెక్కుతూ కూర్చున్న శిల్పిని చూశాడు. ఆ పక్కనే పడేసి ఉన్న విగ్రహమూ అతనికి కనిపించింది. ‘‘ఆ విగ్రహం ఇంచుమించుగా పూర్తయిపోయింది కదా! మళ్లీ రెండో విగ్రహాన్ని చెక్కుతున్నావేంటి’’ అంటూ వాకబు చేశాడు స్నేహితుడు. ‘‘ఆ విగ్రహం సరిగా రాలేదు’’ అంటూ బదులిచ్చి తన పనిలో నిమగ్నం అయిపోయాడు శిల్పి. ఆ మాటలకు స్నేహితుడు శిల్పం దగ్గరకి వెళ్లి పరీక్షగా చూశాడు. ఎంతగా చూసినా అతనికి ఎలాంటి లోపమూ కనిపించలేదు. ‘‘అదేంటి శిల్పం అద్భుతంగా వచ్చింది కదా! నేను చూసిన గొప్ప శిల్పాలలో ఇది ఒకటని ఖచ్చితంగా చెప్పగలను,’’ అన్నాడు స్నేహితుడు.


శిల్పి చిరునవ్వుతో ‘‘ఒక్కసారి ఆ శిల్పం కళ్లని పరీక్షగా చూడు. అవి సరిగ్గా కుదరలేదు,’’ అని చెప్పాడు. స్నేహితుడు మరోసారి ఆ శిల్పాన్ని పరీక్షగా చూస్తే ఆ మాట నిజమేననిపించింది. కానీ అంత చక్కటి శిల్పాన్ని పక్కన పెట్టడాన్ని అతని మనసు ఇంకా ఒప్పుకోలేదు. ‘‘ఆ శిల్పాన్ని ఎక్కడ ఉంచుతున్నారు!’’ అని అడిగాడు స్నేహితుడు. ‘‘ఈ ఊరి దేవాలయంలో, పది అడుగుల ఎత్తైన పీఠం మీద,’’ బదులిచ్చాడు శిల్పి. ‘‘నీకేమన్నా మతి పోయిందా! పది అడుగుల ఎత్తైన పీఠం మీద, మరో పది అడుగుల ఎత్తున్న ఈ విగ్రహంలోని కళ్లలో చిన్నపాటి లోపం ఎవరికి కనిపిస్తుంది. పైగా కాస్త రంగు పూశావంటే ఆ ఉన్న కాస్త లోపమూ ఎవ్వరికీ తెలియనే తెలియదు. దాని కోసం రెండు నెలలుగా పడ్డ కష్టాన్ని వృధా చేసుకుంటావా! ఈ పల్లెటూరి బైతుల కోసం ఇంత కష్టం అవసరమా!’’ అంటూ దులిపేశాడు స్నేహితుడు.


శిల్పి చిరునవ్వుతో- ‘‘ఈ విగ్రహంలో లోపం ఎవ్వరికీ, ఎప్పటికీ తెలియకపోవచ్చు. కానీ నాకు తెలుసు కదా! ఒక లోపంతో ఉన్న శిల్పాన్ని చెక్కానన్న విషయం నా మనసులో నిలిచిపోతుంది. అది జీవితాంతం నా వృత్తి మీద ఒక మచ్చగానే మిగిలిపోతుంది. ఇక కష్టాన్ని వృధా చేసుకోవడం అంటావా... అది నా దృష్టిలో పనితీరుని మరింతగా మెరుగుపరుచుకోవడమే! మనం చేసే పనికి ఎంత ధర వస్తోంది? ఎవరి కోసం పనిచేస్తున్నాం? అన్న విషయం ఎప్పుడూ ముఖ్యం కాదు. మనసుకి తృప్తి కలిగించేలా పనిని పూర్తిచేశామా లేదా అన్నదే ముఖ్యం. ఆ తృప్తి కోసం పడే తపన మన పనిని మరింతగా మెరుగుపరుస్తుంది. అదే చివరివరకూ నిలుస్తుంది,’’ అంటూ చెప్పుకొచ్చాడు.

(ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)

- నిర్జర.