బలపడుతోన్న బంధం!

Publish Date:Nov 20, 2013

Advertisement

 

 

 

కాంగ్రెస్ పార్టీ దుర్మార్గాలకు వ్యతిరేకంగా పుట్టి ప్రభంజనం సృష్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు నరేంద్రమోడీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రభంజనం సృష్టిస్తున్న పార్టీ భారతీయ జనతాపార్టీ. ఒకే లక్ష్యంగా ముందడుగు వేస్తున్న రెండు శక్తులు ఒకటయితే ఎలా వుంటుంది? ఒక ఉన్నత లక్ష్యం మరింత సులభంగా చేరుకోవడానికి వీలవుతుంది. అందుకే భారతీయ జనతాపార్టీ, తెలుగుదేశం పార్టీల మధ్య స్నేహబంధం బలపడుతోంది.

 

 

రాబోయే ఎన్నికలలో కలసి కాంగ్రెస్‌ పార్టీని ఎదుర్కొనే విధంగా రంగం సిద్ధమవుతోంది. దీనికోసం విశేషంగా కృషి చేస్తున్న వ్యక్తి మరెవరో కాదు.. బీజేపీ అగ్ర నాయకుడు వెంకయ్య నాయుడు. గత కొంతకాలంగా కేంద్ర రాజకీయాల మీదే దృష్టిని కేంద్రీకరించిన వెంకయ్య నాయుడు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల వైపు కూడా చూస్తున్నారు. ఇంతకాలం రాష్ట్ర బీజేపీలో కిషన్‌రెడ్డి చెప్పిందే వేదంలా నడిచింది. ఆయన జై తెలంగాణ అంటే కేంద్ర నాయకత్వం కూడా జై తెలంగాణ అంది. అయితే తెలంగాణ విషయంలో కిషన్‌రెడ్డికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం రాష్ట్రంలో పార్టీకి ఎంత నష్టం చేసిందో బీజేపీ నాయకత్వం ఇప్పుడిప్పుడే గ్రహిస్తోంది. ఆ నష్టాన్ని పూడ్చుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. రాష్ట్రంలో బీజేపీ తెలంగాణకు పూర్తిస్థాయిలో మద్దతు ప్రకటించడం వెంకయ్య నాయుడికి ఇష్టం లేకపోయినా, పార్టీ విధానాన్ని గౌరవించి ఆయన ఇంతకాలం మౌనంగా వున్నారు.
ఇప్పుడు నరేంద్రమోడీ బీజేపీ ప్రధాని అభ్యర్థిగా తెరమీదకి వచ్చాక తెలంగాణ విషయంలో బీజేపీ స్వరం మెల్లమెల్లగా మారుతోంది. రాష్ట్రంలో ఇతర పార్టీలో ఇంతవరకూ అనుసరిస్తున్న ఏకపక్ష వైఖరిలో కూడా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అందులో మొదటి అడుగే తెలుగుదేశం పార్టీతో స్నేహం పెంచుకోవడం. బీజేపీ-టీడీపీ దోస్తీని కిషన్‌రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. అయినా ఆయన మాట చెల్లకుండా పోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. కిషన్ రెడ్డి ఎంత వ్యతిరేకించినా బీజేపీ-టీడీపి బంధాన్ని బలపరచడానికి వెంకయ్యనాయుడు కృషి చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ విషయంలో ఏదైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాల్సిందిగా కేంద్ర నాయకత్వం నుంచి కిషన్ రెడ్డికి ఇప్పటికే ఆదేశాలు అందినట్టు తెలుస్తోంది.  జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే త్వరలోనే టీడీపీ-బీజేపీ జట్టు కట్టడం ఖాయమనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

By
en-us Political News