బీజేపీ.. ఆపరేషన్ తెలంగాణ

 

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండు నెలలు కూడా సమయం లేదు. దీంతో అన్ని పార్టీలు ఎన్నికల ప్రణాళికలు, ప్రచారాలతో బిజీబిజీ అయిపోయాయి. ప్రధానంగా తెరాస, మహాకూటమి మధ్య పోటీ జరగనుంది. అధికారం మాది అంటే మాది అంటూ దూసుకుపోతున్నాయి. అయితే ఎప్పటినుండో దక్షిణాదిలో పాతుకుపోవాలని చూస్తున్న బీజేపీ తెలంగాణ మీద ప్రత్యేకదృష్టి పెడుతోంది. ఇప్పటికిప్పుడు అధికారం పొందకపోయినా బలమైన పార్టీగా ఎదగాలని చూస్తోంది. అందుకే తెలంగాణలోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది కానీ కొన్ని స్థానాల మీదనే ప్రత్యేక దృష్టి పెట్టాలనుకుంటుంది. దానిలో భాగంగానే 30 స్థానాలను టార్గెట్ గా పెట్టుకుందట. దీంతో కనీసం 15 స్థానాలైనా గెలిచే అవకాశం ఉంటుందని బీజేపీ భావిస్తోంది. 15 స్థానాలు ఉంటే ఆటోమేటిక్ గా రాష్ట్రంలో కీలక పార్టీ అవుతుంది. '119 స్థానాల్లో పోటీ చేయి.. 30 స్థానాలు టార్గెట్ చేయి.. 15 స్థానాలు గెలువు.. కింగ్ మేకర్ అవ్వు' ఇది ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ ఫార్ములా. అంతేకాదు తెలంగాణ ఎన్నికల ప్రచారం విషయంలో కూడా బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఎన్నికల ప్రచారానికి 15మంది పార్టీ సీఎంలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి 100మంది ఎంపీ, ఎమ్మెల్యే స్థాయి నేతలు రాబోతున్నారట. మొత్తానికి బీజేపీ తెలంగాణను బాగానే టార్గెట్ చేసినట్టుంది.