జగన్ క్రిస్టియానిటీయే ఆయుధం... 2024కి బీజేపీ-జనసేన ఉమ్మడి వ్యూహం..!

 

2024 నాటికి ఇటు తెలంగాణలోనూ... అటు ఏపీలో కూడా బలపడాలనుకుంటోంది బీజేపీ. అయితే, తెలంగాణలో పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నా... ఆంధ్రప్రదేశ్లో మాత్రం పరిస్థితులు అంత ఆశాజనంగా లేవు. ఎందుకంటే మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఒక్క శాతం ఓట్ షేర్ కూడా రాలేదు. అయితే, ఎన్నికల తర్వాత బీజేపీలోకి వలసలు పెరగడం... నలుగురు టీడీపీ ఎంపీలు... పార్టీలో చేరడంతో... ఏపీ బీజేపీలో కొంత ఊపు వచ్చింది. ఇక, పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు... ఒకరిద్దరు వైసీపీ ఎంపీలు కూడా బీజేపీలో చేరతారనే టాక్ నడుస్తోంది. అయితే, పవర్ ఫుల్ మాస్ లీడర్ లేని లోటు మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. గత ఎన్నికలకు ముందు పవన్ ను సంప్రదించినా... జనసేనాని నో చెప్పారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవిని సంప్రదించినా ఆయనా సున్నితంగా తిరస్కరించారు. అయితే, ఎన్నికల తర్వాత పరిస్థితులు తారుమారు కావడంతో... ఇప్పుడే పవనే... బీజేపీ వైపు చూస్తున్నాడని అంటున్నారు. ఇక, బీజేపీకి ఎలాగూ పవన్ లాంటి క్రౌడ్ ఫుల్లర్ అవసరం ఉంది. ఉందుకే వీళ్లిద్దరి మధ్య చర్చలు నడుస్తున్నాయని చెబుతున్నారు. ఆమధ్య అమెరికాలో పర్యటనలో బీజేపీ కీలక నేత రామ్ మాధవ్... జనసేనాని పవన్ కల్యాణ్ చర్చలు జరిగాయట. బీజేపీ-జనసేన కలిసి పనిచేయడంపైనే వీళ్లిద్దరి మధ్య చర్చలు సాగాయి.

అయితే, ఇప్పుడు జగన్ లక్ష్యంగా పవన్ విరుచుకుపడటం వెనుక బీజేపీ వ్యూహం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇసుక ఇష్యూ... ఆ తర్వాత ఇంగ్లీష్ వివాదంపై విమర్శలు ఎలాగున్నా... మతపరమైన అంశాలను తెరపైకి తేవడం వెనుక మాత్రం బీజేపీ ఉందనే ప్రచారం జరుగుతోంది. జగన్ క్రిస్టియానిటీని పదేపదే ప్రస్తావించడం... తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేయడం.... తిరుమలలో సుప్రభాతాన్ని కూడా ఇంగ్లీష్ లో వినిపించాలనడం వెనుక కాషాయ వ్యూహం ఉందంటున్నారు. జగన్ అసలు తిరుమల లడ్డూ తింటారా అంటూ గుచ్చిగుచ్చి ప్రశ్నించడం వెనుక బీజేపీ మత రాజకీయం ఉందని అంటున్నారు. మతపరంగా జగన్ ను టార్గెట్ చేయడం వెనుక జనసేన-బీజేపీ ఉమ్మడి వ్యూహం ఉందంటున్నారు. ఇక, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా కూడా జగన్ ను మతపరంగానే టార్గెట్ చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సైతం జగన్ ను మతపరంగా విమర్శిస్తున్నారు. అయితే, పవన్ మాత్రం బీజేపీ అజెండానే అమలు చేస్తున్నారనే మాట గట్టిగా వినబడుతోంది.

జగన్ క్రిస్టియానిటీని పదేపదే తెరపైకి తీసుకొచ్చి హిందువులను తమవైపు తిప్పుకోవాలన్నదే బీజేపీ-జనసేన వ్యూహంగా తెలుస్తోంది. అందుకే అదేపనిగా జగన్ పై మతపరంగా అటాక్ చేస్తున్నారని అంటున్నారు. ఢిల్లీ పర్యటనలో పవన్... కాషాయ పెద్దలను కలిసి ఇదే అంశంపై చర్చించారని చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు ఎలాంటి ప్రభావం లేకపోయినా, పదేపదే జగన్ క్రిస్టియానిటీని తెరపైకి తేవడం ద్వారా 2024 నాటికి ప్రజల్లో ఎఫెక్ట్ ఉంటుందనేది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. మరి, బీజేపీ మతపరమైన అజెండాను జనసేనాని నెత్తిన పెట్టుకుని మోస్తారా? లేక విధానపరమైన అంశాలపై మాత్రమే పోరాడతారో చూడాలి. అయితే, ఉత్తరాది తరహా మతతత్వ ఫార్ములా ఏపీలో వర్కవుట్ కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.