కుర్చీ కోసం మహా గందరగోళ రాజకీయం...

 

మహారాష్ట్ర రాజకీయంలో సస్పెన్స్ వీడటం లేదు. ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన సై అంటున్నా ఎన్సీపీ, కాంగ్రెస్ మధ్య చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ రూపొందించుకుని దానిపై అన్ని పార్టీలు సంతకాలు చేయాలని నిర్ణయించాయి. అయితే దీనిపైనే సోనియా, పవార్ ల మధ్య చర్చలు సాగుతున్నాయి. రెండ్రోజుల నుంచి ఢిల్లీ లోనే ఉన్న శరద్ పవార్ శివసేనతో పొత్తు పై చర్చిస్తున్నారు. శివసేనతో కలిసేందుకు ఎన్సీపీ, కాంగ్రెస్ అంగీకరించినట్లు వార్తలొచ్చాయి. కానీ ప్రభుత్వం ఏర్పాటు దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు. పైగా రాష్ట్రపతి పాలన అమలులో ఉండటంతో సీన్ ప్రెసిడెంట్ దగ్గరికి వెళుతోంది. శివసేన నేతలు మాత్రం డిసెంబర్ మొదటి వారం లోపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. ఐదేళ్లు తామే సీఎం అని ఎన్సీపీకి, కాంగ్రెస్ కి కీలక పదవులు ఇస్తామని చెబుతోంది. అయితే ఎన్సీపీ కూడా సీఎం పదవి కోసం పట్టుబడుతుందన్న మాటలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా శివసేనతో చర్చలు జరుగుతున్నాయ అన్న ప్రశ్నకు శరద్ పవార్ నిజమా అంటూ సమాధానం ఇవ్వడం అనేక అనుమానాలకు తావిచ్చింది. శరద్ పవార్ కామెంట్స్ తో ఏదో జరుగుతుందనే అనుమానాలు ఉన్నప్పటికీ శివసేన మాత్రం పవార్ వ్యాఖ్యలను అర్థం చేసుకోవాలంటే వంద జన్మలెత్తాలి అని చురకలు అంటిస్తున్నారు. 

అయితే శివసేన బిజెపియేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఉవ్విళ్లూరుతుండగా బిజెపి మాత్రం తెర వెనుక ప్రయత్నాలు చేస్తుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఓ వైపు అతవోళి లాంటి మంత్రుల నుంచి శివసేనకూ రాయబారం పంపుతూనే ఎన్సీపీకి గాలం వేస్తోందన్న ప్రచారం సాగుతుంది. ఇప్పుడు మరాఠా రాజకీయాల్లో పవార్ శివసేనతో కలవకుండా ఉండేందుకు తెర వెనుక వ్యూహాలు పన్నుతున్నారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఎన్సీపీకి ప్రభుత్వంలో కీలక పదవులతో పాటు శరద్ పవార్ కి రాష్ట్రపతి పదవి ఇస్తామన్న ప్రతిపాదన బిజెపి నుంచి వచ్చిందంటున్న ప్రచారం జరుగుతుంది. కానీ శరద్ పవార్ మాత్రం బిజెపితో కలిసేది లేదంటున్నారు. కాంగ్రెస్ తోనే తమ పొత్తు కొనసాగుతుందని చెబుతున్నారు. మహారాష్ట్రలో బిజెపియేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటున్నారు. మరోవైపు శివసేనతో కలవడం వెనుక కాంగ్రెస్ లో అంతర్మథనం మొదలైంది. చాలా వరకు భిన్నదారులు ఉన్న పార్టీతో పొత్తు ఏంటని ప్రశ్నిస్తున్నారు కొందరు నేతలు. సేనతో పొత్తు పెట్టుకుంటే ముస్లిం ఓటర్లు దూరమవుతారని చెబుతున్నారు. మహారాష్ట్ర రాజకీయాల్లో సస్పెన్స్ కొనసాగుతూ ఉండగానే పాత మిత్రుడు పిలిస్తే వెళ్లేందుకు సేనా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా బిజెపి 50-50 ఆఫర్ కి ఓకే అంటే పార్టీతో పొత్తుకు సై అంటున్నారు శివసేన వర్గాలు. ఇలా మొత్తంగా సీన్ మొత్తం సీఎం కుర్చి చుట్టూ తిరుగుతోంది.ఈ సస్పెన్స్ కు తెర ఎప్పుడు పడనున్నదో వేచి చూడాలి.