బీజేపీలో జనసేన విలీనం.. బీజేపీ సీఎం అభ్యర్థిగా పవన్!!

 

అమెరికాలో తానా ఉత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తానా వేడుకల్లో అతిథిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ జాతీయ కార్యదర్శి రామ్ మాధవ్ తో సమావేశమయ్యారు. అమెరికాలో జరిగిన వీరి భేటీ అందరిలోనూ ఆసక్తి కలిగించింది. ఇది కచ్చితంగా రాజకీయ భేటీ అయ్యుంటుందని వార్తలు కూడా వచ్చాయి. అయితే పవన్, రామ్ మాధవ్ మాత్రం అలాంటిదేం లేదని కొట్టి పారేస్తున్నారు.  పాత పరిచయంతోనే రామ్ మాధవ్ ను కలిశానని పవన్ వెల్లడించారు. తాను రామ్ మాధవ్ ను కలవడం వెనుక ఆపరేషన్ ఆకర్ష్ లాంటివేమీ లేవని స్పష్టం చేశారు. రామ్ మాధవ్ కూడా పవన్ ను స్నేహపూర్వకంగానే కలిశానని, తమ భేటీ వెనుక రాజకీయ ఉద్దేశాలు లేవని స్పష్టం చేశారు. ప్రస్తుతం పవన్ తో పనిచేసే ఉద్దేశం లేదని, అయితే పార్టీలోకి ఎవరొచ్చినా స్వాగతిస్తామని చెప్పారు.

వీరిద్దరూ ఇది స్నేహపూర్వక భేటీ అని చెప్తున్నప్పటికీ, ఈ భేటీలో ప్రధానంగా రాజకీయ అంశాలే చర్చకు వచ్చాయని ప్రచారం జరుగుతోంది. పార్టీలోకి ఎవరొచ్చినా స్వాగతిస్తామని చెప్పిన రామ్ మాధవ్.. నిజంగానే ఈ భేటీలో పవన్ ని బీజేపీలోకి ఆహ్వానించారని వార్తలొస్తున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన ఘోర పరాజయాన్ని చవిచూసింది. మరోవైపు బీజేపీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. దానిలో భాగంగా ఇప్పటికే పలువురు టీడీపీ నేతలను పార్టీలో చేర్చుకుంటున్న బీజేపీ.. ఇప్పుడు పవన్ మీద దృష్టి పెట్టిందట. పవన్ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ.. ఆయనకు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. పవన్ కి దగ్గరైతే యూత్ బీజేపీకి దగ్గరవుతారని ఆ పార్టీ అధిష్టానం భావిస్తోందట. అదేవిధంగా మెజారిటీ కాపు సామాజికవర్గం కూడా పవన్ వెంట నడిచే అవకాశముంది బీజేపీ అంచనా వేస్తోందట. అందుకే ఇప్పుడు పవన్ కి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తుందని తెలుస్తోంది. దానిలో భాగంగానే రామ్ మాధవ్.. పవన్ ని కలిసి జనసేనను బీజేపీలో విలీనం చేయాలనీ అప్పుడు మీరే సీఎం అభ్యర్థి అని చెప్పారట.. లేదా వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని కోరారట. 

అయితే ఈ విషయంలో పవన్ మాత్రం వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ ఏపీకి అన్యాయం చేసిందని గతంలో పవన్ పదేపదే విమర్శించారు. ఇప్పుడు అదే బీజేపీతో దోస్తీ అంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లి జనసేన మరింత బలహీన పడుతుందని ఆయన భావిస్తున్నారట. ఇక విలీనం అనే మాట వింటేనే పవన్ ఉలిక్కిపడుతున్నారట. గతంలో పవన్ సోదరుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన సంగతి తెలిసిందే. ఉమ్మడి రాష్ట్రంలో 18 ఎమ్మెల్యే సీట్లు కూడా గెలుచుకుంది. అయితే తరువాత చిరంజీవి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసారు. దీంతో ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పుడసలు రాజకీయాలకే దూరంగా ఉంటున్నారు. అందుకే పవన్ విలీనం అంటేనే ఉలిక్కిపడుతున్నారట. అదీగాక ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేయడం పట్ల పవన్ కూడా అప్పుడు అసంతృప్తి వ్యక్తం చేసారు. మళ్ళీ ఇప్పుడు తానే తాను స్థాపించిన పార్టీని విలీనం చేయడం కరెక్ట్ కాదని పవన్ భావిస్తున్నారట. అయితే బీజేపీ కనీసం పవన్ తో పొత్తుకైనా ఒప్పించాలని చూస్తోందట. మరి పవన్ బీజేపీతో కలిసి పనిచేసే విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.