జవాన్లు పోరాడుతుంటారు, చస్తుంటారు.. కొత్తేముంది..

 

కేంద్రంలోనే అధికారంలో ఉన్నాం కదా అని బీజేపీ నేతలు ఈ మధ్య తాము ఏం చేసినా..ఏం మాట్లాడినా సరిపోతుంది అనుకుంటున్నట్టు ఉన్నారు. అందుకే ఏం మాట్లాడుతున్నామో కూడా తెలియకుండా మాట్లాడి అధికార అహంకారం చూపిస్తున్నారు. దక్షిణ కశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్ కౌంటర్ లో భారత జవాన్లు మృతి చెందిన సంగతి తెలిసిందే కదా. ఇక ఈ ఘటనపై స్పందించిన బీజేపీ ఎంపీ నేపాల్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  ‘శత్రువులతో సరిహద్దుల్లో జవాన్లు పోరాడుతుంటారు, చస్తుంటారు..అందులో కొత్తేముంది. ఆర్మీలో సిబ్బంది అంటేనే ఏదో ఒకరోజు యుద్ధంలో ప్రాణాలు వదలాల్సిందే’ అంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. ఇక జరగాల్సిన నష్టం జరిగినపోయిన తరువాత... సొంత పార్టీ నేతలతో పాటు ఇతర పార్టీల నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుండటంతో... మాట మార్చాడు. జవాన్లను, అమరవీరులను తానేమీ అవమానించే విధంగా వ్యాఖ్యలు చేయలేదని, ఒకవేళ తాను చేసిన వ్యాఖ్యలు అలా అనిపిస్తే క్షమాపణలు చెబుతున్నానని కవరింగ్ ఇచ్చారు. మరి అనడం ఎందుకు.. క్షమాపణలు చెప్పడం ఎందుకో...