అభివృద్ధి హైవే వదిలి హిందూత్వ బైపాస్‌కి రూటు మార్చిన బీజేపీ!   

దేశంలో హిందూత్వ పార్టీ అనగానే మనకు గుర్తుకు వచ్చేది బీజేపీనే! శివసేన లాంటి పార్టీలు అక్కడా ఇక్కడా వున్నా ప్రధానమైన హిందూత్వ ఎజెండాతో నడిచే కాషాయ పార్టీ కమలదళమే! అయితే, ఆరెస్సెస్ అండతో ముందుకు పోయే బీజేపీ రెండు రకాల మాటలతో రాజకీయం చేస్తూ వుంటుంది. ఒకవైపు అభివృద్ధి, సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అంటూనే మరో వైపు అవసరమైనప్పుడల్లా రామ మందిరం, హిందూత్వా అంటుంది! ఎప్పుడు ఏది వర్కవుట్ అవుతుందో బీజేపీ పెద్దలకు బాగా తెలుసు. అలాగే ఎప్పుడు ఎవరు మాట్లాడాలో కూడా వారికి బాగా తెలుసు! అభివృద్ధి , అవినీతి నిర్మూలన, నల్లధనం, నిరుద్యోగం లాంటి మాటలు మాట్లాడే వారు గోవధ నిషేధం, ముస్లిమ్ లలో జనాభ పెరుగుదల, అయోధ్య రామ మందిరం… ఇలాంటి అంశాల జోలికి వెళ్లరు. తాజాగా కాషాయ నేతల వరుస కామెంట్లు చూస్తే మనకు రానున్న ఎన్నికల ఎజెండా ఏంటో తెలిసిపోతుంది!

 

 

2014లో కాంగ్రెస్ పదేళ్ల పాలనలోని అవినీతి, స్కామ్ లు మోదీకి బాగా కలిసొచ్చాయి. అందుకే, ఎక్కువగా హిందూత్వ ఎజెండా నెత్తికెత్తుకోలేదు. కాంగ్రెస్ హఠావ్ నినాదంతో అబ్ కీ బార్ మోదీ సర్కార్ అంటూ హోరెత్తించారు. కానీ, నాలుగేళ్ల తరువాత సీన్ మొత్తం రివర్సైంది. మోదీ వచ్చాక చేపట్టిన నోట్ల రద్దు, జీఎస్టీ వంటి ప్రయోగాలు పేద, మధ్యతరగతి వారికి అసతంతృప్తి కలిగిస్తున్నాయి. అలాగే, ఉత్తరాదిలో బీజేపీ పట్టు అంతకంతకూ సడలుతోంది. పోయిన సారి ఎంపీల సీట్ల విషయంలో రాష్ట్రాలకు రాష్ట్రాలు క్లీన్ స్వీప్ చేసిన చోట ఇప్పుడు ఉప ఎన్నికల్లో వరుస ఓటములు భయపెడుతున్నాయి. అందుకే, ఉత్తరాది హిందూ ఓటర్లని కదిలించే పనిలో పడింది కాషాయ దళం. అందుకు తగ్గట్టే అతివాదులుగా ముద్రపడ్డ బీజేపీ నేతలు నోటికి పని చెబుతున్నారు. కొన్ని రోజుల వ్యవధిలో వారి కామెంట్లు చూస్తే భవిష్యత్ వ్యూహం ఏంటో అర్థమైపోతుంది!

 

 

ఉత్తర్ ప్రదేశ్ నుంచీ పార్లెమంట్ కు ఎంపికైన ఎంపీ హరి ఓం పాండే. ఈయన తాజా కామెంట్ ఏంటంటే… దేశ స్వాతంత్ర్యం తరువాత ముస్లిమ్ జనాభ క్రమంగా పెరుగుతూ వస్తోంది. అందువల్లే ఉగ్రవాదం, అత్యాచారాలు పెరుగుతున్నాయి. మనం తక్షణం పార్లమెంట్లో జనాభ పెరుగుదల నియత్రణ కోసం బిల్లు తీసుకురాకపోతే మరోసారి పాకిస్తాన్ లాగా భూభాగం కోల్పోవాల్సి వస్తుంది! ఇదీ ఆయన చేసిన హాఠాత్తు వ్యాఖ్య!

 

ఉత్తర్ ప్రదేశ్ కే చెందిన మరో బీజేపీ నేత సురేంద్ర సింగ్. ఆయన కూడా ముస్లిమ్ లలో జనాభా పెరుగుదల ఎక్కువగా వుందని అన్నారు. అందుకు విరుగుడుగా హిందువులు కూడా అయిదుగురు పిల్లల్ని కనమని పిలుపునిచ్చారు. ఇద్దరు మగ పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు, మరొకరు ఎవరైనా ఫర్వాలేదని ఆయన అన్నారు!

బీజేపీ ఉత్తరాది నాయకులు మైనార్టీ వర్గాల్ని టార్గెట్ చేస్తే దక్షిణాది నేతలు మేధావుల్ని, అభ్యుదయవాదుల్ని విమర్శిస్తున్నారు. కర్ణాటకలో ఈ మద్యే ఎన్నికల్లో గెలిచిన ఓ ఎమ్మెల్యే మేధావుల్ని, అభ్యుదయవాదుల్ని ఏకంగా కాల్చిపారేయాలని అభిప్రాయపడ్డాడు. తానే దేశ హోంమంత్రి అయితే పోలీసులకి కాల్చిపారేయమని ఆదేశాలు ఇస్తానన్నాడు బసన గౌడ! కర్ణాటకలో ఈ మధ్యే గౌరీ లంకేష్ లాంటి రచయిత్రి మీద దాడి జరగటం మనందరికీ తెలిసిందే!

 

 

ముస్లిమ్ లకు వ్యతిరేకంగా, మేధావులు, అభ్యుదయవాదులకి వ్యతిరేకంగా ఇలా మాట్లాడే వారు బీజేపీలో ఎప్పుడూ వుంటారు. కానీ, వీరంతా ఇప్పుడు హఠాత్తుగా వ్యాఖ్యలు చేయటం యాదృచ్ఛికం కాకపోవచ్చు. గోరక్షకుల దాడుల్ని, ఎక్కడ మైనార్టీలకు, దళితులకి ఏ కాస్త ఇబ్బంది కలిగినా ఆ సంఘటనల్ని కాంగ్రెస్ హైలైట్ చేస్తోంది. ఇతర సెక్యులర్ పార్టీలు కూడా మోదీ సర్కార్ ని వీలైనంత ఇబ్బంది పెడుతూ వస్తున్నాయి. ఇటువంటి సెక్యులర్ రాజకీయాలకు విరుగుడుగా బీజేపీ హిందూత్వ ఎజెండాను మరోసారి నెత్తికెత్తుకుంది.

పరిస్థితి చూస్తుంటే ముందు ముందు ఎన్నికల హోరులో కాషాయ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు ఇంకా పెరిగే సూచనలే కనిపిస్తున్నాయి. 2019 పార్లెమంట్ ఎన్నికల నాటికి ఈ మాటలు పరాకాష్టకు చేర్చి మోదీని మరోసారి పీఠం ఎక్కించటం ఈ మొత్తం వ్యూహం లక్ష్యంగా భావించాలి! అయితే, అది ఎంత వరకూ వర్కవుట్ అవుతుంది? ఓటర్లు ఎంత వరకూ ఎమోషనల్ అవుతారు? వేచి చూడాలి! అంత వరకూ మాత్రం రాహుల్ లాంటి సెక్యులర్ నేతలు, ఓవైసీ లాంటి మైనార్టీ నేతలు బీజేపీ నేతలు చేసే వ్యాఖ్యలకి చెలరేగిపోయి స్పందించటం నిత్య కృత్యమే అవుతుంది!