చంద్రబాబుపై ప్రశంసలు.. ఎందుకో ఈ మార్పు...

 

నిన్నటి వరకూ ఏపీ ప్రభుత్వంపై, చంద్రబాబుపై బీజేపీ ఎమ్మెల్యేలు కస్సుబుస్సులాడారు. ఇక రెండు పార్టీలు విడిపోవడమే మిగిలింది అన్న పరిస్థితి ఏర్పడింది. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ.. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సడెన్ గా ఈ రోజు ప్లేట్ మార్చారు. ఏపీ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ఉండడం రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టమని...ఆయన వంటి నేత రాష్ట్రంలో లేరని అన్నారు. అంతేకాదు.. విభజనతో సమస్యలను ఎదుర్కొంటున్నా ఆయన పట్టువదలకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని, ఇటువంటి నేతకు చేయూత ఇవ్వాలన్నారు. హుద్‌హుద్‌ తుఫాన్‌, విశాఖకు పెట్టుబడులు, దావోస్‌లో చంద్రబాబు పర్యటన, విదేశీపెట్టుబడుల కోసం సిఎం చేస్తున్న ప్రయత్నాలపై ఆయన ఒకటే ప్రశంసలు కురిపించారు. దీంతో మొదట కొంత మంది నేతలు షాకైనా.. ఆతరువాత తేరుకొని ఆయన మాట్లాడుతున్నంత సేపు  సపోర్టుగా బల్లలు చరిచారు. అయితే కొంతమంది టీడీపీ నేతలు మాత్రం.. ఆయనపై విమర్సలు గుప్పిస్తున్నారు.  ఆయనకు అవసరమైనప్పుడు ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును పొగిడి పనులు చేయించుకుంటారని...తరువాత మళ్లీ టిడిపి ప్రభుత్వంపై విమర్శలు చేస్తారని అంటున్నారు. ఇదిలా ఉండగా.. విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షపార్టీ నేతలు కూడా చర్చించుకుంటున్నారు. మరి ఉన్నట్టుండి ఈ ఎమ్మెల్యేగారి మనసు మారడానికి కారణం ఏంటో..దీని వెనుక రాజకీయ ఎత్తుగడ ఏముందో..