ఎలా కొట్టాలో చూపించి 'రాయి' ఏసీపీకి ఇచ్చా!!

 

పోలీసుల దాడి ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంఐఎం చేతిలో కీలుబొమ్మగా మారిందని విమర్శించారు. తనపై పోలీసుల దాడి వెనుక కుట్ర ఉందని ఆరోపించారు. బెంగాల్ మాదిరిగా తెలంగాణలో చేయాలని చూస్తున్నారని విమర్శించారు.  

నగరంలోని పురానాపూల్‌లో రాణి అవంతిభాయ్ పాత విగ్రహం స్థానంలో కొత్త విగ్రాహాన్ని ఏర్పాటు చేసే సమయంలో పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారని, పదేళ్ల నుంచి విగ్రహం అక్కడే ఉందని, ప్రజలకు గానీ, ట్రాఫిక్‌కు గానీ ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పినా పోలీసులు వినలేదని అన్నారు. విగ్రహం మార్పు చేస్తే ఇబ్బందేముందని ప్రశ్నిస్తే గోషామహల్ ఏసీపీ ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని అన్నారు. ఎలాగైనా విగ్రహం ఏర్పాటు చేస్తామని తన కార్యకర్తలు ముందుకు వెళితే పోలీసులు లాఠీ చార్జ్ జరిపారని, ఈ ఘటనలో తన తలకు గాయమైందని రాజాసింగ్ చెప్పారు. తనను చంపాలని అనుకుంటే రాయితో కొట్టండని రాయిని ఏసీపీకి ఇచ్చానని, ఎలా కొట్టాలో చూపించానని రాజాసింగ్ అన్నారు.