తెలంగాణలో బీజేపీ బోణి కొట్టనుంది.. గెలిచే సీట్లు అవేనా?

 

సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఈ నెల 23 న ఫలితాలు వెలువడనున్నాయి. అప్పటికి వరకు నిన్న సాయంత్రం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ గురించి చర్చలు జరుగుతూ ఉంటాయి. లోక్ సభ ఎన్నికల్లో కూడా తెలంగాణలో టీఆర్ఎస్‌కే మెజారిటీ సీట్లు ఖాయమని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. అయితే టీఆర్ఎస్ చెబుతున్న 16 సీట్లకు రెండు, మూడు సీట్లు తగ్గే అవకాశముందని సర్వేలు అంచనా వేశాయి. అంతేకాదు తెలంగాణలో బీజేపీ బోణి కొట్టనుందని అంచనా వేశాయి. దీంతో బీజేపీ గెలవబోయే సీటు ఏది అయ్యుంటుంది అంటూ విపరీతమైన చర్చలు జరుగుతున్నాయి.

తెలంగాణలో బీజేపీ గెలిచే అవకాశమున్న సీటు అంటే ముందుగా కరీంనగర్ పేరు వినిపిస్తోంది. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్ బరిలోకి దిగారు. బండి సంజయ్ ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటారన్న పేరుంది. దీంతో పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలు ఆయన వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా యువత ఆయనకు అండగా నిలబడ్డారు. దీన్నిబట్టి చూస్తుంటే బండి సంజయ్ పుణ్యమా అని తెలంగాణలో బీజేపీ ఖాతాలో ఒక సీటు పడేలా ఉంది.

ఇక బీజేపీ మరో రెండు స్థానాల్లో కూడా బలమైన పోటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అవే సికింద్రాబాద్, నిజామాబాద్ స్థానాలు. ఈ రెండింట్లో ముఖ్యంగా సికింద్రాబాద్ లో బీజేపీ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. సికింద్రాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థిగా సీనియర్ నేత కిషన్ రెడ్డి బరిలోకి దిగారు. సికింద్రాబాద్ లో బీజేపీకి పట్టు ఉండటమే కాకుండా కిషన్ రెడ్డికి కూడా వ్యక్తిగతంగా మంచి ఇమేజ్ ఉండటంతో.. ఇక్కడ బీజేపీ గెలిచే అవకాశాలు లేకపోలేదు. ఇక నిజామాబాద్ లో బీజేపీ గెలుస్తుందని చెప్పలేము కానీ టీఆర్ఎస్ కి గట్టి పోటీ ఇస్తుందనే అభిప్రాయం మాత్రం వ్యక్తమవుతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్టు తెలంగాణలో బీజేపీ బోణి కొడుతుందో లేదో ఈ నెల 23 న తేలనుంది.