ఇంకా బల్బు వెలగలేదా?

 

 

 

రాష్ట్ర విభజన డ్రామాని నానా రకాల ట్విస్టులు తిప్పిన కేంద్ర ప్రభుత్వం లేటెస్ట్ గా రాయల్ తెలంగాణ ట్విస్ట్ ఇచ్చింది. మంత్రివర్గ సమావేశం ఎప్పుడు జరగబోతోందీ చెప్పేసింది. జీఓఎం ఇచ్చిన నివేదికకి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపేస్తుందని కూడా డిసైడ్ చేసేసింది. బిల్లును రాష్ట్రపతి దగ్గరకి ఎప్పుడు పంపేదీ, రాష్ట్రపతి నుంచి రాష్ట్ర అసెంబ్లీకి బిల్లు ఎప్పుడు వచ్చేదీ తీర్మానించేసింది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో గానీ, జనవరిలో జరిపే ప్రత్యేక సమావేశాల్లోగానీ బిల్లు ఆమోదం పొందుతుందని జోస్యం చెప్పేసింది.

 

యుపీఏ ప్రభుత్వం తెలంగాణ బిల్లు విషయంలో ఇలాంటి విషయాలని ముందే చెప్పేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లుకు బీజేపీ మద్దతు ఉండే అవకాశం లేదని తెలుసుకోలేకపోవడం పాపం అమాయకత్వం!  రాష్ట్ర విభజన విషయంలో బీజేపీ కేంద్ర నాయకత్వం విధానం మారిందన్న విషయం రాష్ట్రంలో  చిన్నపిల్లలక్కూడా అర్థమైపోతోంది. కేంద్ర ప్రభుత్వం ట్యూబ్‌లైట్ బుర్ర మాత్రం ఇంకా వెలిగినట్టు లేదు. ఈ విషయం కేంద్ర ప్రభుత్వానికి నిజంగానే అర్థం కాలేదో, లేక అర్థమైనా అర్థంకాన్నట్టు వన్నెచిన్నెలు పోతోందో అనేది అర్థం కాని విషయం.



ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో వున్న బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఏ రాష్ట్రంలో ప్రచార సభ జరిపినా ప్రతిసభలోనూ ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన తెస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశంగా విభజిస్తోందని, యువరాజు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడం కోసం తెలుగు జాతిని చీల్చుతోందని విమర్శిస్తూనే వున్నారు. అలాగే మొన్నామధ్య ఓ సభలో మోడీ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ భారతీయ ప్రజలని ప్రాంతాల పేరుతో విభజిస్తోందని, దానిని తాము ఎంతమాత్రం అంగీకరించమని స్పష్టంగా ప్రకటించారు.



సర్దార్ పటేల్ చెప్పిన సమైక్యతే తమ విధానమని ఆయన ఎలుగెత్తి చాటుతున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజనను నరేంద్రమోడీ ఇంత బాహాటంగా వ్యతిరేకిస్తూ వుంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర విభజన విషయంలో వెనకడుగు వేయకుండా ఆత్రాన్ని ప్రదర్శిస్తూ వుండటాన్ని అమాయకత్వం అనుకోవాలా? అతి తెలివికి తార్కాణమనుకోవాలా?