తెలంగాణ, ఏపీలో అవినీతిమయం

 

అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ విజయవాడలో బీజేపీ ధర్మపోరాట దీక్ష చేపట్టింది. ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ చంద్రబాబుని, టీడీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ మాట్లాడుతూ.. బాధితులు ఢిల్లీ వచ్చి మమ్మల్ని కలిశారని, రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిపై ఆవేదన వ్యక్తం చేశారని అన్నారు. అగ్రిగోల్డ్‌ కుంభకోణం వెనుక ఎవరున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయడమే తమ ఆందోళన ఉద్దేశమని చెప్పారు. ఎన్నో ఆశలతో తెలంగాణలో తెరాసకు, ఏపీలో టీడీపీకి ప్రజలు అవకాశమిస్తే ఈ రెండు ప్రభుత్వాలూ అవినీతిమయం అయ్యాయని ఆరోపించారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే టీడీపీ నేతలు కేంద్రంపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీ అభివృద్ధికి ప్రధాని మోదీ కట్టుబడి ఉన్నారని, గత మూడేళ్లలో అత్యధిక నిధులు కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చాయని రాంమాధవ్‌ వివరించారు.

కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. చంద్రబాబు మనుషులు అగ్రిగోల్డ్ ఆస్తులను దోచుకుంటున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతి కారణంగానే అగ్రిగోల్డ్ బాధితులకు అన్యాయం జరిగిందన్నారు. 3 వేల కోట్ల విలువైన హాయ్‌ల్యాండ్‌ను లోకేష్‌ 270 కోట్లకు కాజేయాలని చూశారని ఆరోపించారు. లోకేష్‌ అడిగిన ధరకు ఇవ్వలేదని వారిని ఇబ్బంది పెడుతున్నారని కన్నా అన్నారు. అగ్రిగోల్డ్‌ యాజమాన్యం, టీడీపీ ప్రభుత్వం కుమ్మక్కై 3 లక్షల మంది బాధితులను ఇబ్బందిపెడుతున్నారని మండిపడ్డారు. అగ్రిగోల్డ్ ఆస్తుల లెక్కలు చెప్పమంటే సంవత్సరానికి ఒక లెక్క చెబుతున్నారని, అగ్రిగోల్డ్ ఆస్తుల విలువను కావాలనే తగ్గించారని కన్నా ఆగ్రహం వ్యక్తం చేసారు.

ఇక అవకాశం దొరికినప్పుడల్లా చంద్రబాబు మీద, టీడీపీ మీద విమర్శల వర్షం కురిపించే జీవీఎల్ నర్సింహరావు మాట్లాడుతూ.. అమరావతిని ల్యాండ్ మాఫియాగా మార్చిన ఘనత చంద్రబాబుదే అని విమర్శించారు. అమరావతి భూములను టీడీపీలోని ల్యాండ్‌ మాఫియా కారు చౌకగా కొట్టేసిందన్నారు. టీడీపీ ఎంపీలే టెండర్లు వేసి వారే కాంట్రాక్టులు దక్కించుకుంటున్నారని ఆయన ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదనే అందిన కాడికి దోచుకుంటున్నారని వ్యాఖ్యానించారు. 1.50లక్షల కోట్లు అప్పులు తెచ్చారని.. వాటికి లెక్కలు చూపాలని డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్‌లో లక్షల మంది దాచుకున్న డబ్బు దోచుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు. ఏపీలో లాలూ ప్రసాద్‌ తరహా ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు. బీహార్‌లో ఆర్జేడీకి వచ్చిన పరిస్థితే ఏపీలో టీడీపీకి రానుందన్నారు. 6 నెలల తర్వాత టీడీపీ ప్రభుత్వం ఉండదని అన్నింటిపై విచారణ జరిపిస్తామని జీవీఎల్ స్పష్టం చేశారు.