రోజుకో మలుపు తిరుగుతున్న బీజేపీ-వైసీపీ పొత్తు కథ.. పురంధేశ్వరి రియాక్షన్!!

ఏపీలో కొంతకాలంగా హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే.. అది 3రాజధానుల అంశం. మూడు రాజధానుల ప్రకటన, దానిపై కమిటీలు, శాసన మండలి రద్దు ఇలా రాజకీయమంతా రాజధాని చుట్టూనే తిరుగుతోంది. అయితే ఇప్పుడు ఏపీ రాజకీయాలు పొత్తుల వైపు టర్న్ అయ్యాయి. సీఎం జగన్ హస్తిన పర్యటనలో కేంద్ర పెద్దలతో భేటీల నేపథ్యంలో ఏదో జరుగుతోందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బిజెపికి అధికార పార్టీ వైసిపి దగ్గరవుతుందా అన్న వార్తలు ఏపీలో హీట్ పెంచుతున్నాయి.  ఎన్డీయేతో వైసీపీ కలుస్తుందా? బీజేపీతో కలిసి నడుస్తుందా? ఇప్పుడివే ప్రశ్నలు ఆసక్తికరంగా మారాయి. 

ఎన్డీయేలో చేరాలని ప్రతిపాదన వస్తే వైసీపీ పరిశీలిస్తుందన్న మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. అలాగే.. అసలు తాము అలాంటి వ్యాఖ్యలు చేయలేదని బొత్స ఖండించినప్పటికీ.. పొత్తులపై చర్చ మాత్రం ఆగడం లేదు. అయితే దర్యాప్తు సంస్థల్లో ప్రభావితం చేసేందుకు వైసిపి బిజెపికి దగ్గరవుతోందని ప్రధాన ప్రతిపక్షం టిడిపి ఆరోపిస్తోంది. అదేవిధంగా అలాంటి పొత్తు ఏమి ఉండదని జనసేన బల్లగుద్ది చెప్తోంది. ఒకవేళ బీజేపీతో వైసీపీ కలిస్తే తాను కమలానికి దూరమవుతానని ఇప్పటికే జనసేనాని పవన్ క్లారిటీ ఇచ్చారు. ఇటు ప్రతి పక్షాలు ఏం మాట్లాడుతున్నా ఎలా మాట్లాడుతున్నా వైసిపి నేతలు మాత్రం ఆచితూచి మాట్లాడుతున్నారు. తమకు బిజెపితో ఎలాంటి శత్రుత్వం లేదని మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. అంతేకాకుండా పార్టీల పొత్తు విషయం, ఎన్డీయే ప్రభుత్వంలో కలిసే విషయాలను సీఎం జగన్ నిర్ణయిస్తారని ఆయా నేతలు వెల్లడిస్తున్నారు. అయితే రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి సఖ్యతతో పనిచేయాల్సిన అవసరముందని అన్నారు అవంతి. 

రాష్ట్రంలో అధికార వైసిపితో గానీ ప్రతిపక్షం టిడిపితో గానీ తమకు ఎలాంటి పొత్తులు లేవని బీజేపీ రాష్ట్ర ఇన్ చార్జ్ సునీల్ దేవదర్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ఆ పార్టీ నేత కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి మరోసారి చెప్పారు. వైసీపీతో పొత్తు ఉండదని జనసేన పార్టీతో కలిసి పని చేస్తామని ఆమె చెప్పారు. రాజధాని మార్పు తొందరపాటు నిర్ణయమని మండిపడ్డారు. ప్రతిపక్షంగా టిడిపి సరైన పాత్ర పోషించడం లేదని విమర్శించారు. సీఎం జగన్ ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పని చేస్తున్నారని ఆమె ఆరోపించారు. మొత్తానికి సీఎం జగన్ హస్తిన పర్యటనకు వెళ్ళినప్పటి నుంచి వైసిపి త్వరలోనే ఎన్డీయే సర్కారులో చేరుతుందని ప్రచారం మొదలైంది. మరి మున్ముందుకి పొత్తు కథ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.