టీడీపీ లో చేరనున్నమాజీ ఎమ్మెల్యే

 

రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో  తెరాస ప్రభుత్వం అధికారం లో కి వచ్చింది.ఆ ఎన్నికలతో కాంగ్రెస్,టీడీపీ పార్టీలు తమ ఉనికిని కోల్పోయాయి.దీంతో ఆయా పార్టీలకు చెందిన కొందరు నేతలు ఇతర పార్టీల  కండువాలు కప్పుకున్నారు.కానీ తెలంగాణలో తాజాగా ఎన్నికలు జరగనుండటంతో అందరి ఊహలకు అతీతంగా పరస్పర వ్యతిరేక పార్టీలు అయిన కాంగ్రెస్,టీడీపీ మహా కూటమితో దగ్గరవటంతో పార్టీల బలం పెరిగింది.నాయకులకు భవిష్యత్తు మీద ఆశకలిగింది.దీంతో ఆయా పార్టీలకు వలసల తాకిడి తగిలింది.తాజాగా పఠాన్‌చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్ టీడీపీ లో చేరనున్నారు.ఆయనతోపాటు పలువురు బీజేపీ, టీఆర్ఎస్ నాయకులు టీడీపీ కండువా కప్పుకోనున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.

పీసీసీ మాజీ చీఫ్‌ డి.శ్రీనివాస్‌కు శిష్యుడిగా నందీశ్వర్‌గౌడ్ గుర్తింపు పొందారు.అప్పట్లో డీఎస్ టీఆర్ఎస్ పార్టీలో చేరటంతో నందీశ్వర్‌గౌడ్ బీజేపీలో చేరారు. గత కొంత కాలంగా డీఎస్‌తో పాటు నందీశ్వర్‌ గౌడ్ కూడా కాంగ్రెస్ గూటికి చేరతారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.కానీ ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును ఈయన అమరావతిలో కలవటంతో టీడీపీలో చేరటం ఖాయమైంది.హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ ‌భవన్‌లో తెలంగాణ టీడీపీ నేతల సమక్షంలో ఆయన పార్టీలో చేరనున్నారు.నందీశ్వర్‌గౌడ్ పఠాన్‌చెరు టిక్కెట్‌ ఆశిస్తున్నారు.