కేంద్రానికి బీజేపీ నేత ఫిర్యాదు.. చిక్కుల్లో ఏపీ సీఎంఓ అధికారి 

ఏపీ ప్రభుత్వం లో సర్వం తానే అయి వ్యవహరిస్తున్న ప్రవీణ్ ప్రకాష్ చిక్కుల్లో పడ్డారు. అటు సీఎం పేషీ లో ముఖ్య అధికారిగా అలాగే అధికారుల బదిలీలు పోస్టింగులు చూసే జీఏడీ లోను ఆయనే ముఖ్య అధికారి గా కొనసాగుతూన్న విషయం తెలిసిందే. ఏపీ మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం ను ఆ పదవి నుండి తప్పించిన వ్యవహారం లోను అయన కీలకంగా వ్యవహరించారు. అసలు చంద్ర బాబు కొంత కాలం సైలెంట్ గా ఉంటే ప్రవీణ్ ఏపీ ప్రభుత్వాన్ని ఒక దరికి చేరుస్తారని ఏపీ సెక్రటేరియట్ లోనే ఒక సెక్షన్ కామెంట్లు చేసుకునే పరిస్థితి ఉంది.

ప్రస్తుతం విషయానికి వస్తే కొద్దీ రోజుల క్రితం సీనియర్ ఐఏఎస్ అధికారి రమామణి కన్నుమూశారు. ఐతే తాజాగా ఆమె మరణానికి కారణం ప్రవీణ్ ప్రకాష్, మరియు వాణిజ్య పన్నుల శాఖలో ముఖ్య అధికారి కారణమని ఆమె సోదరుడు కృష్ణ మూర్తి ఆరోపించారు. రెండు నెలల క్రితం వాణిజ్య పన్నుల శాఖలో పని చేస్తున్న ఆమెను అక్కడి నుండి తప్పించి మళ్ళీ ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా వేధించారని అయన ఆరోపించారు. సిన్సియర్ ఐఏఎస్ అధికారి అయిన ఆమెను ఆ పోస్టు నుండి తప్పించే ముందు వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారి ఢిల్లీలో పని చేస్తున్న తన భార్య కారు బిల్లులు చెల్లించాలని అలాగే ఆ శాఖ పేషీ ఖర్చులు కూడా ఆమె భరించాలని ఒత్తిడి తెచ్చినట్లుగా ఆమె సోదరుడు ఆరోపించారు. రెండు నెలల నుండి ఆమెకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా మానసికంగా ప్రవీణ్ వేధించారని ఆమె సోదరుడు కృష్ణ మూర్తి ఆరోపించారు. ఇంట్లో ఖాళీగా ఉండి జీతం తీసుకోవడం ఇష్టం లేక పోస్టింగ్ కోసం ఆమె ప్రవీణ్ ప్రకాష్ ను కలవగా మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫేస్ బుక్ లో పోస్టులు పెడుతున్నారు అని ఫిర్యాదులు వచ్చాయని ప్రశ్నించినట్లు అయన తెలిపారు. తనకు వాట్స్ఆప్ తప్ప వేరే సోషల్ మీడియాలో అకౌంట్ లేదని ఆమె తెలపడం తో వాట్స్ఆప్ లోనే మీరు ప్రభుత్వానికి వ్యతిరేక పోస్టులు పెడుతున్నారట అని ఆమెకు ఎటువంటి పోస్టింగ్ ఇవ్వలేదు. ఇదంతా కేవలం తనకు ఎటువంటి పోస్టింగ్ ఇవ్వకుండా ఉండటానికి ఇవన్నీ చేస్తున్నారని ఆమె తీవ్ర మానసిక వేదనకు గరయ్యారని ఆమె సోదరుడు ఆరోపించారు. అయినా ఎక్కడి ఢిల్లీలో ఉన్న అధికారుల భార్యల ఖర్చులు ఆమె ఎందుకు భరించాలని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఆమెకు పోస్టింగ్ ఇవ్వకుండా వేధించిన ఇదే ప్రవీణ్ ప్రకాష్ తన సోదరి మరణించినపుడు హాస్పిటల్ కు రావడం తమను ఆశ్చర్యానికి, అనుమానానికి గురి చేసిందని అయన ఆవేదన వ్యక్తం చేసారు. 

తాజా గా బీజేపీ అధికార ప్రతినిధి రఘు ఈ విషయంపై స్పందిస్తూ ప్రవీణ్ ప్రకాష్ పై చర్యలు తీసుకోవాలని ఢిల్లీలోని అఖిల భారత సర్వీసుల వ్యవహారాలు చూసే డీవోపీటీకి లేఖ రాశారు. ఒకపక్క సీఎంఓలో సీఎం ముఖ్య కార్యదర్శిగా ఆదేశాలిస్తూ, మరో పక్క ప్రభుత్వపరంగా జీఏడీ అధికారి హోదాలో వాటిని అమలుచేస్తున్న తీరు బిజినెస్ రూల్సుకు విరుద్ధమని రఘు స్పష్టం చేశారు. ఆయన అహంకారపూరిత స్వభావం వల్లనే, సిన్సియర్ ఐఏఎస్ అధికారిణి రమామణి మృతి చెందాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.