వాళ్లు గుమాస్తాలైతే మీరు.. జనం పిచ్చోళ్లా...

 

పోలవరం ప్రాజెక్టు విషయంలో ఇంకా వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. ఏదో ఒక రకంగా కష్టపడి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశలపై కేంద్రం నీళ్లు చల్లింది. రాష్ట్ర ప్రభుత్వం స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌లో కొంత భాగానికి పనులు చేయాల్సిన నేపథ్యంలో టెండర్లకు పిలుపు నివ్వగా... కేంద్ర ప్రభుత్వం ఆ టెండర్లు కాస్త ఆపేయాలని ఆదేశాలు జారీ చేసింది. జాతీయ హైడ్రో పవర్ కార్పొరేషన్ అద్యయనం చేసేవరకు పనులను నిలుపుదల చేయాలని కేంద్రం చెప్పింది. దీంతో చేసేది లేక రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు ప్రక్రియ నిలిపేసింది. ఇక కేంద్రం చేసిన ఈ పనికి చంద్రబాబుకు కూడా కోపం వచ్చి కేంద్రం పై బాగానే సీరియస్ అయ్యారు. పోలవరం టెండర్ల విషయంలో కేంద్రం ఆపమంటే ఆపేస్తామనే.. కేంద్రం అదే వైఖరితో ఉంటే వాళ్ళకే అప్పజెప్పి నమస్కారం పెడతానని ఓపెన్ గానే సీరియస్ అయ్యారు. పోలవరం ప్రాజెక్ట్‌ను సకాలంలో పూర్తి చేస్తానంటే ఇప్పటికిప్పుడే కేంద్రానికి అప్పగిస్తామన్నారు. కేంద్రం ముందుకొస్తే తనకెలాంటి భేషజాలు లేవని.. "పోలవరం పనులు రాష్ట్ర ప్రభుత్వం చేయాలని నీతి ఆయోగ్ చెప్పింది.. నేనేమీ కావాలని తీసుకోలేదు" అని చంద్రబాబు చెప్పారు.

 

ఒక్క చంద్రబాబుకే కాదు పోలవరం విషయంలో బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయానికి రాష్ట్ర ప్రజలు బీజేపీ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు.. ఏదో పీకేద్దామనుకున్న బీజేపీకి తెలుగు ప్రజలకు కోపం వస్తే ఎలా ఉంటుందో కాంగ్రెస్ విషయంలో చూసింది కాబట్టి ఇప్పుడు సొల్లు కబుర్లు చెపుతుంది. బాబు గట్టిగా మాట్లాడటం... జనాల్లో వస్తున్న కోపం చూసి బీజేపీ నేతలు ప్లేట్ ఫిరాయించారు. సోము వీర్రాజు అయితే తన వల్లే పోలవరం ప్రాజెక్టు వచ్చింది అన్న రేంజ్ లో మాట్లాడాడు. ఇప్పుడు ఆయనకు తోడు మరో బీజేపీ నేత బయలుదేరాడు. ఏపీ లో ఐదు లోక్ సభ నియోజకవర్గాలకు ఇన్ ఛార్జ్ గా వ్యవహరిస్తున్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి. మురళీధరరావు ఈ పోలవరం వివాదంపై మాట్లాడుతూ.. ఇదంతా కేంద్రజలవనరుల శాఖ అధికారుల మీదకు తోసేస్తూ చంద్రబాబుని కూల్ చేసే పని మొదలెట్టారు. పోలవరం విషయంలో... గుమాస్తాలు మాటలు పట్టించుకుంటారా అని అంటున్నాడు. పాపం బాబుగారు ఏదో కవర్ చేద్దామనుకున్నారు కానీ.. ఇక్కడే అధికారులను గుమస్తాలతో పోల్చి బుక్కయ్యారు. ఓ జాతీయ సంస్థ కి నాయకత్వం వహిస్తున్న ఓ ఐఏఎస్ అధికారి ని గుమస్తాగా జమకట్టడంతోనే బీజేపీ నాయకులకు అధికారం ఏ స్థాయిలో తలకు ఎక్కిందో అర్ధం అవుతుంది అని అనుకుంటున్నారు.

 

అంతేకాదు.. గతంలో జరిగిన సంఘటనలు కూడా గుర్తుచేసుకుంటున్నారు. ఆ అధికారి ఇలా వ్యవహరిస్తున్నాడని ఇంతకుముందు ఎన్నిసార్లు చెప్పినా కేంద్రం పట్టించుకోలేదు. చివరకు కేంద్రమంత్రి ఉమా భారతి ముందే చంద్రబాబుని ఆ అధికారి తక్కువ చేసి మాట్లాడిన రోజున చంకలు గుద్దుకుని సంతోషపడ్డ బీజేపీ నేతలు ఇప్పుడు మాత్రం ప్రజల కోపాన్ని చూసి ప్లేట్ మారిస్తే సరిపోతుందా అని మండిపడుతున్నారు. ఏదో అయ్యా బాబు అని చంద్రబాబు పోలవరం కోసం పాట్లు పడుతుంటే.. అటు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రంలో ఉన్న చిన్న చితకా.. కనీసం ఒక్క ఓటు కూడా లేని నాయకులు ఇప్పుడు మైకుల ముందుకు వచ్చి.. బాబు పై కామెంట్లు చేస్తున్నారు. మరి ఇవన్నీ చూస్తూ ప్రజలు ఊరుకుంటారా.. వాళ్లేం పిచ్చోళ్లు కాదు కదా.. అన్నీ గమనిస్తూనే ఉంటారు. అందుకే పోలవరం విషయంలో చంద్రబాబుకు మద్దతుగా.. బీజేపీ చేసిన పనికి మండిపడుతున్నారు. అధికారం ఉంది కదా అని ఏం మాట్లాడినా సరిపోతుంది అని అనుకుంటే అది అమాకత్వమే అవుతుంది. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. వారే బుద్ది చెబుతారు.