పవన్ కళ్యాణ్ కు బీజేపీ బిగ్ షాక్.. తిరుపతి నుండి మేమే పోటీ చేస్తాం

జీహెచ్ఎంసీ ఎన్నికలలో బీజేపీతో అవగాహనకు వచ్చిన జనసేన చివరి నిమిషంలో బరి నుండి తప్పుకుంది. బీజేపీ అగ్రనేతల రాయబారం తర్వాత ఎన్నికల బరి నుంచి తప్పుకునేందుకు పవన్ కల్యాణ్ అంగీకరించారు. అయితే త్వరలో ఏపీలోని తిరుపతి లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక జరగబోతుండడంతో.. ఆ సీట్‌‌ను జనసేన కోరుకుంటోంది. బీజేపీ కోసం జిహెచ్ఎంసి ఎన్నికల నుండి తప్పుకున్నామని, దీనికి ప్రతిగా తిరుపతి సీటును తమకు ఇవ్వాలని కోరడానికి జనసేన నేతలు పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ ఢిల్లీ చేరుకున్నారు. అయితే నిన్న సోమవారం నుంచి ఇప్పటివరకు వారికి బీజేపీ అగ్రనేతల అపాయింట్ మెంట్ ఇంకా దొరకలేదు. దీంతో బీజేపీ అగ్రనేతలను కలవడం కోసం పవన్, మనోహర్ ఎదురు చూస్తున్నారు.

 

ఇది ఇలా ఉండగా తిరుపతి లోకసభ సీటును జనసేనకు ఇవ్వబోమని, తామే అక్కడ నుండి పోటీ చేస్తామని బీజేపీ ఎంపీ జీవీఎల్ స్పష్టం చేసారు. తమ పార్టీ గతంలో కూడా తిరుపతి లోక్ సభ స్థానం నుండి గెలిచిందని ఆయన గుర్తు చేశారు. మరోపక్క తిరుపతిలో పోటీ చేస్తామని ముందే ప్రకటించిన ఎపి బీజేపీ ఇన్ ఛార్జ్ సునీల్ దియోధర్ కూడా జనసేనకు అడ్డుపడుతున్నట్లు తెలుస్తోంది. తిరుపతిలో పోటీ చేసి.. పవన్ కల్యాణ్ మద్దతుతో వైసీపీని ఓడించొచ్చని.. దీంతో ఏపీలో తమ పరపతి పెరుగుతుందని.. పైగా సీఎం జగన్ కూడా తమ కంట్రోల్ లో ఉంటాడని బిజెపి స్కెచ్ వేసింది. ఇంతకూ బీజేపీకి గ్రేటర్ ఎన్నికలలో చేసిన సాయానికి బదులుగా మిత్రపక్షం జనసేనకు తిరుపతి సీటు ఇస్తారా.. లేక అక్కడ కూడా బీజేపీ నే పోటీ చేస్తుందా వేచి చూడాలి.