బీజేపీ ప్రస్తానానికి బీజం... వైసీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో ఏపీలో అడ్డా..

అయిననూ పోయిరావలె హస్తినకు అన్నట్టు తయారైంది ఏపీ రాజకీయం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో బలంగా నిలవడానికి బీజేపీ బాటలు వేసుకుంటుంది. అందుకుగానూ అందుబాటులో ఉన్న మార్గాలని అన్వేషిస్తోంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి మోహన్ రావు, టిజి వెంకటేష్ బిజెపిలో చేరిపోయారు. దీంతో రాజ్యసభలో కమలనాథుల బలం పెరిగింది. 2024 ఎన్నికల నాటికి ఆంధ్ర ప్రదేశ్ లో బీజేపీని ఒక బలమైన శక్తిగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు పార్టీ పెద్దలు. ఇందు కోసం ఎటువంటి కార్యాచరణతో ముందుకెళ్లాలి అన్న అంశంపై బిజెపి కేంద్ర పెద్దలు అనేక మంది నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు.

ఏపీలో 2019 ఎన్నికల ముందు వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో అనధికార అవగాహనతో పని చేసిన బిజెపి.. జగన్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత దూరం జరిగింది. ఇసుక కొరత, రాజధాని నిర్మాణాల నిలిపివేత, పోలవరం రివర్స్ టెండరింగ్, గ్రామ వాలంటీర్ల నియామకాల వంటి పలు నిర్ణయాలను బిజెపి తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రస్తుతం ఇరుపక్షాలు ఒకరి పై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలకు సమదూరం పాటించి ఏపీలో సొంతంగానే ఎదగాలని బిజెపి అనుకుంటుంది. రాజకీయంగా బలాబలాలను లెక్కలు వేసుకుంటూ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడమే వారి ప్రధాన లక్ష్యంగా ఉంది.

ఈ అంశాలపై మాట్లాడేందుకే బిజెపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, సుజనా చౌదరి ఇంటికి లంచ్ కు వచ్చారు. సరిగ్గా అదే సమయానికి సుజనాని కలుసుకునేందుకు జెసి దివాకర్ రెడ్డి కూడా అక్కడికొచ్చారు. ఈ తరుణంలో సుజనా చౌదరి , దివాకర్ రెడ్డిని నడ్డాకు పరిచయం చేశారు. జేసీ రాజకీయ అనుభవాన్ని కూడా వివరించారు. ఏపీలో నెలకొన్న తాజా పరిణామాలపైనా వీరి మధ్య చర్చ జరిగింది. జెసి దివాకర్ రెడ్డి, జెపి నడ్డా మధ్య సంభాషణలు చాలా విషయాలు దొర్లాయి.
ఏపీలో భారీ మెజారిటీతో జగన్ అధికారంలోకి రావడంతో ఆయనపై ప్రజల్లో అంచనాలు పెరిగాయని జేసీ వివరించారు. ప్రజల ఆశలకు తగ్గట్టుగా జగన్ పాలను సాగకపోతే అసంతృప్తి రాజుకుంటోందని ఇప్పుడు రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి నెలకొన్నదని నడ్డాకి ఆయన స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయాలకు న్యాయపరమైన చిక్కులు వంటి పలు కీలక అంశాలను దివాకరెడ్డి ప్రస్తావించారు. అనంతపురంలో తన బస్ ట్రావెల్స్ పై జరుగుతున్న దాడులు రాష్ట్రంలో టిడిపి, బిజెపి కార్యకర్తలపై సాగుతున్న కక్షసాధింపులను కూడా ఏకరువు పెట్టారు. ఈ భేటీ ముగిసిన తర్వాత సుజనా చౌదరితో చెప్పినట్టు సుమారు గంట సేపు సమావేశమయ్యారు. వీరిరువురి మధ్య కూడా ఏపీలో కమలనాథులు అనుసరించాల్సిన వ్యూహంపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఎపిలో బిజెపిని బలోపేతం చేసేందుకు రోడ్ మ్యాప్ తయారు చేసుకోవాలని కూడా వారు నిర్ణయానికొచ్చారు.

ఈ సమయంలోనే టిడిపితో పాటు ఇతర పక్షాల నుంచి బీజేపీలోకి వచ్చే నేతలు వివరాలను సుజనా చౌదరి నడ్డాకి తెలియజేశారు. ఎపిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధానాలపై హస్తిన పెద్దలకి సమాచారం ఉన్నప్పటికీ లోతైన అవగాహన కోసం పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని సుజనా చౌదరిని జెపి నడ్డా కోరారు. జెసి దివాకర్ రెడ్డి చెప్పిన కొన్ని అంశాల పై నడ్డా తన అభిప్రాయాల్ని చెప్పారు. రాజకీయాల్లో మరీ ఇంత కక్షపూరిత ధోరణి అవసరం లేదని బహిరంగంగానే అన్నారు. డిసెంబర్ 8వ తేదీన విజయవాడకు నడ్డా వస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీజేపీ పదాధికారుల సమావేశంలో ఆయన పాల్గొనబోతున్నారు. ఈ సమయంలో మరి కొందరు నేతలను పార్టీలో చేర్చుకునే అంశంపై మాట్లాడేందుకే ప్రధానంగా జెపి నడ్డా.. సుజనా చౌదరి ఇంటికొచ్చారు.పనిలో పనిగా ఏపిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానాల పై కూడా చర్చ సాగటం గమనార్హం. జాతీయ మీడియాలో సైతం ఏపీ ప్రభుత్వం పై వస్తున్న వ్యతిరేక కథనాలని ఈ సందర్భంగా నడ్డా ప్రస్తావించినట్టు సమాచారం. దీంతో ఎపిలో ఏం జరుగుతోందన్న అంశంపై బిజెపి హైకమాండ్ కు అవగాహన ఉందని నిర్ధారణ అవుతోంది. రానున్న రోజుల్లో ఎపి రాజకీయాల్లో బిజెపి పోషించబోయే పాత్ర గురించే ఇప్పుడు అందరిలో ఆసక్తి నెలకొన్నది.