టీఆర్ఎస్ భయపడుతోందా? కమలం కవ్వింపులకు కారు ఎందుకు షేక్ అవుతోంది?

 

తాడిని తన్నేవాడు ఒకడుంటే... వాడి తలను తన్నేవాడు మరొకడు ఉంటాడంటారు. తెలంగాణలో ఇప్పుడిలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ఎందుకంటే, నిన్నమొన్నటివరకు నేతలంతా గులాబీ గూటికి క్యూ కడితే, ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. ఇప్పుడు టీఆర్ఎస్ నేతలు సైతం కమలం వైపు చూస్తున్నారు. దాంతో ఇప్పటివరకు ఏకఛత్రాధిపత్యంగా నడుస్తోన్న గులాబీ హవాకు మెల్లమెల్లగా గండిపడుతోంది. ఎందుకంటే, రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో చెప్పలేము. ఇప్పటివరకు తమకు తిరుగులేదని దీమాతో ఉన్న టీఆర్‌ఎస్‌‌కు ఇప్పుడు బీజేపీ ఫీవర్ పట్టుకుంది. పదవులు దక్కని లీడర్లంతా కమలం గూటికి వెళ్లే ప్రమాదముందనే భయం కారు పార్టీని వెంటాడుతోంది.

పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయ వాతావరణం స్లోగా మారుతోంది. ఎవరూ ఊహించని స్థాయిలో నాలుగు పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకోవడమే కాకుండా, కేసీఆర్ కూతురు కవితను ఓడించి, తమ సత్తా ఏంటో చూపించిన బీజేపీ ఈసారి తెలంగాణపై సీరియస్ గా గురిపెట్టింది. దక్షిణాదిన కర్నాటక తర్వాత ఒక్క తెలంగాణలో మాత్రమే పరిస్థితులు పూర్తి అనుకూలంగా ఉన్నాయని గుర్తించిన కాషాయ అధినాయకత్వం....సీరియస్ ఆపరేషన్ మొదలుపెట్టింది. ఏదో తూతూమంత్రంగా కాకుండా, 2023లో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. అందుకే కేవలం కాంగ్రెస్, టీటీడీపీ లీడర్లనే కాకుండా, అధికార టీఆర్ఎస్ లో అసంతృప్త లీడర్లను గుర్తించి, కమలం గూటికి చేర్చేందుకు స్కెచ్ వేసింది. ముఖ్యంగా టీఆర్ఎస్ ద్వితీయశ్రేణి నాయకత్వంపై బీజేపీ గురిపెట్టింది. తెలంగాణ ఉద్యమం నుంచి టీఆర్ఎస్ వెన్నంటి ఉన్నా, పదవులు రాని లీడర్లకు గాలమేస్తోంది.

2014లో టీఆర్ఎస్ మొదటిసారి అధికారంలోకి వచ్చినా, నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో మాత్రం నాన్చుడి ధోరణినే కొనసాగించింది. రెండోసారి అధికారంలోకి వచ్చాకైనా, పదవుల పంపిణీ జరుగుతుందని ఆశించిన లీడర్లకు నిరాశే ఎదురైంది. దాంతో టీఆర్‌ఎస్ ద్వితీయశ్రేణి నాయకత్వం తీవ్ర అసంతృప్తికి గురవుతోంది. అ అసంతృప్త నేతలంతా... ఇఫ్పుడు బీజేపీ వైపు చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే, బీజేపీ వ్యూహాన్ని, ఎత్తుల్ని పసిగట్టిన టీఆర్ఎస్... అసంతృప్త నేతలను బుజ్జగించే పనిలో ఉందట. నామినేటెడ్ పోస్టుల ఆశ కల్పిస్తూ ఆచితూచి వ్యవహరిస్తోందని అంటున్నారు. అయితే, ఇప్పటికే పలువురు టీఆర్‌ఎస్ ద్వితీయశ్రేణి లీడర్లు... కమలం గూటికి చేరేందుకు రంగంసిద్ధంచేసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. వీళ్లంతా త్వరలో తెలంగాణకు రానున్న బీజేపీ అధ్యక్షుడు అమిత్‌‌షా ఆధ్వరంలో... కాషాయ కండువా కప్పుకుంటారని చెబుతున్నారు. మొత్తానికి తెలంగాణలో ఎలాగైనా పాగా వేయాలని కంకణం కట్టుకున్న కమలదళం... ఆపరేషన్ ఆకర్ష్‌ను బలంగా చేపడుతోంది.