ఓట్ల  కోసం గ్లామర్ మంత్రాన్ని నమ్ముకుంటోన్న బీజేపీ! 

సినిమా నటులు, ఇతర సెలబ్రిటీలకు దాదాపుగా అన్ని పార్టీలు పిలిచి టికెట్లు ఇస్తుంటాయి. ఎందుకు? దీని వెనుక పెద్ద లాజిక్కే వుంది. సినిమా వాళ్లో, సెలబ్రిటీలో అయితే గెలిచే అకాశాలు చాలా ఎక్కువ. అదీ తొలిసారి రంగంలోకి దిగుతున్న వారైతే జనం క్రేజ్ తో ఓట్లు వేసేస్తారు. ఆ తరువాత వారు ఎంత వరకూ నియోజక వర్గానికి ఉపయోగపడతారన్నది వాళ్ల ఆసక్తి, నిజాయితీ మీద ఆధారపడి వుంటుంది. కానీ, ఎవరికీ తెలియని కొత్త వార్ని తెచ్చి నిలబెట్టేదాని కన్నా కాస్త పేరున్న సెలబ్రిటీల్ని నిలపటం పార్టీలకి సేఫ్. అందుకే, వారి కోసం ఎన్నికల సీజన్లో గాలం వేస్తుంటాయి. ఇక గెలుపు కంటే మరో ముఖ్యమైన అంశం… సెలబ్రిటీలు పార్టీల అధినాయకత్వానికి పెద్దగా ప్రమాదం కాదు. వారు ఎంత మెజార్టీతో గెలిచినా తమ పని తాము చేసుకుపోతుంటారు తప్ప దాదాపు ఏ సందర్భంలోనూ పార్టీ నాయకత్వానికి తలనొప్పులు తీసుకురారు. సెలబ్రిటీలకు అసలు సిసలు పార్టీల అంతర్గత రాజకీయం తెలియదు కాబట్టి నాయకత్వాన్ని ధిక్కరించి ముఠాలు కట్టటం లాంటివి చేయరు. ఇలా రెండు విధాలా లాభం వుండటం వల్లనే ఈ సారి మరో మారు బీజేపి సెలబ్రిటీ గ్లామర్ పై ఆశలు పెట్టుకుంటోంది.

 

 

దేశంలోని చిన్న చిన్న ప్రాంతీయ పార్టీలు కూడా సినిమా వాళ్ల కోసం ఎప్పుడూ ఎదురు చూస్తుంటాయి. అలాంటిది బీజేపీ, కాంగ్రెస్ వార్ని ఎలా వదిలేస్తాయి. ఇప్పటికే చాలా మంది సినిమా వాళ్లు కాంగ్రెస్ , బీజేపీల టికెట్లపై గెలిచారు. అమితాబ్ బచ్చన్ మొదలు మన కృష్ణంరాజు దాకా వున్న వాళ్ల లిస్ట్ చాలా పెద్దదే! అయితే, 2014లో మోదీ యూపీఏ పై దండయాత్ర చేసి స్వంత మెజార్టీతో నెగ్గారు. అందులో కూడా సెలబ్రిటీల పాత్ర కాస్త వుందనే చెప్పాలి. హేమామాలిని లాంటి వారు ఎప్పటిలాగే కమల దళం కోసం పోటీ చేయగా కొత్తగా పరేష్ రావల్, అనుపమ్ ఖేర్ భార్య , సీనియర్ నటి కిరణ్ ఖేర్, ఒలంపిక్ గోల్డ్ మెడలిస్ట్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ లాంటి వారు ఎన్నికల బరిలో దూకారు.

 

 

2014 కంటే ఇప్పుడు మోదీ పరిస్థితి కాస్త క్లిష్టంగా వుంది. అయిదేళ్ల ప్రభుత్వ వ్యతిరేకత పైకి కనిపించకున్నా ఆందోళన కలిగిస్తోంది. అందుకే, జనం ఈజీగా కన్విన్స్ అయ్యేలా మరింత మంది సెలబ్రిటీలను బ్యాలెట్ బ్యాటిల్ లోకి దించాలని డిసైడ్ అయ్యారట. ముఖ్యంగా, బాలీవుడ్ లో షారుఖ్, సల్మాన్, ఆమీర్ ఖాన్లకు ధీటుగా నిలుస్తూ కరుడుగట్టిన ఉత్తరాది బీజేపీ అభిమానులకు ఫేవరెట్ అయిన అక్షయ్ కుమార్ ని రంగంలోకి దించే యోచనలో వున్నారట. కానీ, ఆయన బీజేపీ పెద్దలు ఆశించినట్టు పంజాబ్ నుంచో, దిల్లీ నుంచో తలపడాలంటే ముందు కెనడా పౌరసత్వం వదులుకోవాలి. ఇప్పటికే మోదీ, అమిత్ షా టీమ్ అక్కీకి రెడీ అవ్వమని చెప్పారట. బాలీవుడ్ ఖిలాడీ ఏం చేస్తాడో! అక్షయ్ తో పాటూ అనుపమ్ ఖేర్ ని కూడా బీజేపీ పోటీలో పెట్టాలని భావిస్తుందంటున్నారు.

 

 

నానాపటేకర్ ని ఆయన స్వంత రాష్ట్రం మహారాష్ట్ర నుంచీ పోటీ చేయిస్తారట. వీరే కాకుండా ఎన్నికలు దగ్గర పడుతోన్నకొద్దీ మరింత మంది కాషాయ కండువాలతో పార్టీకి సెలబ్రిటీ గ్లామర్ తెస్తారని ప్రచారం జరుగుతోంది. కాకపోతే, ఇటు తెలంగాణలో పెద్దగా బలం లేక, అటు ఏపీలో ప్రత్యేక హోదా విషయంలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోన్న బీజేపీతో ముందకు సాగటానికి ఇక్కడైతే ఏ సెలబ్రిటీ సాహిసించే పరిస్థితి లేదు! తెలుగు రాష్ట్రల్లో కొత్తగా బీజేపీ కండువాలు కప్పుకునే మూడ్ లో ఏ ప్రముఖులు కూడా కనిపించటం లేదు. మరీ ముఖ్యంగా సినీ సెలబ్రిటీలైతే అంత రిస్క్ తీసుకుంటారని అస్సలు భావించలేం. కాబట్టి బీజేపీ సెలబ్రిటీ గ్లామర్ మంత్రానికి తెలుగు రాష్ట్రాల్లో అయితే చింతకాయలు రాలవనే నిర్ణయించుకోవాలి!