అసహనమా..? అక్రోశమా..? కట్టు దాటుతున్న కమలనాథులు..!!

దేశంలోని ఇతర రాజకీయ పార్టీలతో పోలిస్తే.. క్రమశిక్షణకు, కఠిన నియమాలకు పెట్టింది పేరు భారతీయ జనతా పార్టీ. కానీ ఇటీవలికాలంలో ఆ పార్టీ నేతలు కట్టుతప్పుతూ జనంలో బీజేపీని చులకన చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రత్యేకహోదా, విభజన సమస్యలు తదితర అంశాల్లో న్యాయం చేయాలని కోరుతున్న ఆంధ్రప్రదేశ్ వాదనలను కేంద్రం ఏ మాత్రం పట్టించుకోక పోగా.. ఏపీ కోసం మాట్లాడుతూ.. తమను ప్రశ్నిస్తున్న వారిని బీజేపీ నేతలు టార్గెట్ చేస్తున్నారు.

 

తాజాగా ప్రత్యేకహోదా అంశంపై ఓ టీవీ ఛానెల్ డిస్కషన్‌లో పాల్గొన్న.. సినీనటుడు శివాజీపై బీజేపీ కార్యకర్తలు దాడికి దిగారు.. ప్రజలు ఇంకా సహనంతో బీజేపీ నేతలను మాట్లాడనిస్తున్నారని.. ఇంకా ఎక్కువ మాట్లడితే తరిమి, తరిమి కొడతారని శివాజీ అనడం .. అక్కడే ఉన్న కాషాయ దళానికి చిర్రెత్తుకొచ్చి ఆయనపై విరుచుకుపడ్డారు. ఇదే సమయంలో కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు పద్మపై కూడా దాడికి దిగబోతే పక్కనున్న ప్రజాసంఘాల ప్రతినిధులు అడ్డుకున్నారు. అసలు బీజేపీకి ఏమైంది.. ఎందుకు ఇంతలా అసహనాన్ని ప్రదర్శిస్తున్నారంటే.. ఒకప్పటి బీజేపీలో ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన కార్యకర్తలే.. నేతలుగా ఎదిగారు.

 

కఠినమైన నియమాలతో.. గట్టుదాటితే తీవ్రమైన చర్యలు తీసుకునే ఆర్ఎస్ఎస్‌ శిక్షణతో.. బీజేపీలోకి అడుగుపెట్టిన వారు ఇప్పటికీ అదే దారిలో వెళ్తున్నారు. వేరే పార్టీల నుంచి వచ్చిన వలసనేతలకు బీజేపీ నియమాలు తెలియవు కాబట్టి.. ఎవరైనా ప్రశ్నిస్తే.. ఏం సమాధానం చెప్పాలో తెలియక.. అక్రోశంతో భౌతిక దాడులకు దిగుతున్నారు. దాని వల్ల సమస్య మరింత తీవ్రమవుతుందే తప్ప.. పరిష్కారం కాదన్నది వారు గుర్తించాలి. శివాజీపై జరిగిన దాడి ఏ పవన్ కళ్యాణ్ మీదనో.. మరే ఛరిష్మా ఉన్న నేత మీదో జరిగి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. ఇప్పటికైనా అగ్రనాయకత్వం చర్యలకు దిగి.. కట్టుదాటుతున్న నేతలను క్రమశిక్షణలో పెట్టాలని సోషల్ మీడియాలో వాదనలు వినిపిస్తున్నాయి.