భూపేంద్ర యాదవ్, గరికపాటి వచ్చేస్తున్నారు! హైదరాబాద్ ఊపిరి పీల్చుకో..

దుబ్బాక ఉప ఎన్నిక రాజేసిన కాక చల్లారకముందే తెలంగాణలో మరో ఎన్నిక హీట్ పుట్టిస్తోంది. ముందస్తుగా జరగబోతున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నిక అన్ని పార్టీల్లోనూ సెగలు రేపుతోంది. దుబ్బాక విజయంతో జోష్ మీదున్న బీజేపీ గ్రేటర్ పై దూకుడు పెంచింది. బల్దియాపై జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికలను వచ్చే అసెంబ్లీ సమరానికి సెమీ ఫైనల్ గా భావిస్తోంది బీజేపీ. అందుకే అన్ని శక్తులను గ్రేటర్ లో మోహరిస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల ఇంచార్జ్ గా  పార్టీకి జాతీయ స్థాయిలో కీలకంగా ఉన్న నేతను నియమించింది బీజేపీ. హైదరాబాదు లో అణువణువు తెలిసిన ఎంపీ గరికపాటి మోహన్ రావును రంగంలోకి దించింది.  రాష్ట్ర స్ఠాయిలోనూ సీనియర్లతో  ప్రత్యేక కమిటిని ఏర్పాటు చేసింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికను బీజేపీ హైకమాండ్ నేరుగా పర్యవేక్షిస్తుందని చెబుతున్నారు.దీన్ని బట్టే గ్రేటర్ ఎన్నికలపై కమలదళం ఎంత సీరియస్ గా ఉందో తెలిసిపోతోంది.  

 

పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న భూపేంద్రయాదవ్ ను జీహెచ్ఎంసీ ఎన్నికల ఇంచార్జీగా నియమించింది బీజేపీ. ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాలను అశ్చర్యపరుస్తోంది. భూపేంద్రయాదవ్ ను బీజేపీలో ట్రబుల్ షూటర్ గా చెప్పుకుంటారు. బీజేపీలో ప్రసుతం ఆయన ప్రధాని మోడీ, అమిత్ షా, పార్టీ చీఫ్ జేపీ నడ్డా తర్వాత స్థానంలో ఉన్నారని చెబుతారు. బీజేపీ ఎన్నికల వ్యూహాలు రచించండలో దిట్ట భూపేంద్ర యాదవ్. ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ ఇంచార్జ్ గా భూపేంద్రనే వ్యవహరించారు. బీహార్ లో తేజస్వి యాదవ్ సీఎం కావడం ఖాయమని మెజార్డీ ఎగ్డిట్ పోల్స్, రాజకీయ విశ్లేషకులు అంచనా వేసినా బీజేపీ కూటమే గెలిచిందంటే అందుకు భూపేంద్ర యాదవ్ వ్యూహాలే కారణమంటున్నారు. ఆయన ఎత్తుల వల్లే జేడీయూ ఆశించిన ఫలితాలు సాధించకపోయినా.. 65 శాతం సక్సెస్ రేటుతో బీజేపీ గెలవడం వల్లే బీహార్ లో ఎన్డీఏ కూటమికి మళ్లీ అధికారం దక్కిందని చెబుతున్నారు.  
 

2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ దేశవ్యాప్తంగా బీజేపీ హవా చూపడంలో  భూపేంద్ర యాదవే కీలకంగా వ్యవహరించారని కమలం నేతలు చెబుతున్నారు. అంతేకాదు కీలక రాష్ట్ర్రాల అసెంబ్లీ ఎన్నికల బాధ్యతలన్ని బీజేపీ అధినాయకత్వం భూపేంద్ర యాదవ్ కే అప్పగిస్తారని తెలుస్తోంది. బీజేపీలో ఏ సమస్యలు వచ్చినా పరిష్కార బాధ్యతలు భూపేంద్రకే ఇస్తారని కూడా చెబుతున్నారు. తనకు అప్పగించిన టాస్క్ లో ఎక్కువ సార్లు భూపేంద్ర సక్సెస్ అయ్యారని టాక్ ఉంది. జాతీయ స్థాయిలో తమ పార్టీ కీలక వ్యూహకర్తగా ఉన్న వ్యక్తిని ఒక నగరం స్థానిక ఎన్నికకు ఇంచార్జ్ గా నియమించిందంటేనే గ్రేటర్ హైదరాబాద్ పై బీజేపీ ఎంత ఫోకస్ చేసిందో ఊహించవచ్చు.

 

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీకి ఎంపీ గరికపాటి మెహన్ రావు కీలకంగా మారారు. గతంలో టీడీపీలో కీలక నేతగా ఉండి ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఎంపీ గరికపాటి మోహన్ రావుకు సిటీలో చాలా పరిచయాలున్నాయి. రాజకీయంగానూ ఆయనకు బలమైన అనుచరవర్గం ఉంది. ఎలాగైనా గ్రేటర్ లో టీఆర్ఎస్ కు షాకిచ్చేందుకు ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడానికి ఇష్టపడటం లేదు బీజేపీ. అందుకే గ్రేటర్ లో గట్టి పట్టున్న టీడీపీతో పొత్తుకు ప్రయత్నాలు చేస్తోందని చెబుతున్నారు. టీడీపీతో పొత్తు కోసం ఆ పార్టీ అధినేత చంద్రబాబుతో గరికపాటి మోహన్ రావు  రాయబారం నడుపుతున్నారని తెలుస్తోంది. బలమైన లీడర్లు లేకున్నా గ్రేటర్ లో టీడీపీకి భారీగా ఓటు బ్యాంక్ ఉంది. గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి పలు సర్వేలు నిర్వహించిన సర్వేల్లోనూ టీడీపీకి 15 శాతం ఓటు బ్యాంక్ ఉందని తేలింది. అందుకే టీడీపీ పొత్తు కోసం బీజేపీ ప్రయత్నాలు చేస్తుందని చెబుతున్నారు. బీజేపీతో పొత్తుకు చంద్రబాబు అంగీకరిస్తే గ్రేటర్ పోల్ సీన్ పూర్తిగా మారిపోనుంది. ఇప్పటికే జనసేనతో పొత్తున్న బీజేపీకి టీడీపీ తోడైతే గ్రేటర్ వార్ వన్ సైడ్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఈజీగానే గ్రేటర్ పీఠాన్ని కైవసం చేసుకుంటుందని రాజకీయ వర్గాలు కూడా అంచనా వేస్తున్నాయి. 

 

గ్రేటర్ పరిధిలోని సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గానికి  కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నాయకత్వం వహిస్తున్నా.. ఆయనపై పార్టీ హైకమాండ్ కు నమ్మకంగా లేదంటున్నారు. అందుకే కిషన్ రెడ్డిని కాదని భూపేంద్రయాదవ్ ను ఇంచార్జీగా నియమించారని, గరికపాటికి కీలక బాధ్యతలు అప్పగించారని చెబుతున్నారు. రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రి కాబట్టి.. ప్రజల్లో అనుమానాలు రాకుండా ఉండేందుకే ఆయనను ఎన్నికల కమిటి కన్వీనర్ గా నియమించారని బీజేపీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక గెలుపులోనూ కిషన్ రెడ్డికి ఏమాత్రం పాత్ర లేదంటున్నారు. కిషన్ రెడ్డి ఒంటెద్దు పోకడల వల్లే తెలంగాణలో బీజేపీ ఎదగలేదనే ఆరోపణలు పార్టీ నేతల నుంచి వస్తున్నాయి. అందుకే కిషన్ రెడ్డిని నామ్ కే వాస్తాగా కన్వీనర్ గా పెట్టి.. భూపేంద్ర, గరికపాటికి కి గ్రేటర్ ఎన్నిక బాధ్యతలను హైకమాండ్  ఇచ్చిందని చెబుతున్నారు. 

 

23 మందితో ఏర్పాటు చేసిన గ్రేటర్ ఎన్నికల కమిటీలో పార్టీ సీనియర్లతో పాటు మంచి వ్యూహకర్తలుగా పేరున్న, ఆర్థికంగా బలంగా ఉన్న నేతలను  నియమించింది బీజేపీ. ఎంపీ గరికపాటి మోహన్ రావుతో మాజీ ఎంపీలు వివేక్, జితేందర్ రెడ్డి, మాజీ మంత్రులు డీకే అరుణ, మోత్కుపల్లి నర్సింహులు గ్రేటర్ బీజేపీ కమిటిలో ఉన్నారు. అంతేకాదు అన్ని సామాజిక వర్గాల నేతలకు అందులో చోటు కల్పించారు. ఈ కమిటి ద్వారా అన్ని రకాలుగా గ్రేటర్ ఎన్నికలకు బీజేపీ సమాయత్తమవుతున్నట్లు కనిపిస్తోంది. అలాగే  గ్రేటర్ లోని ఇతర పార్టీల నేతలకుు వల  వేస్తోంది. ఇప్పటికే బీజేపీలోకి వలసలు జోరందుకున్నాయి. ఎల్బీ నగర్ ఏరియాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత కొప్పుల నర్సింహరెడ్డి బీజేపీలో చేరారు. ఆయన బాటలోనే మరికొందరు నేతలు ఉన్నారని చెబుతున్నారు. మైలార్ దేవ్ పల్లి కార్పొరేటర్ ఇటీవలే బీజేపీలో చేరగా.. మరికొందరు టీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా కాషాయ కండువా కప్పుకోనున్నారని తెలుస్తోంది. కారు, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కొందరు ముఖ్య నేతలు కూడా తమకు సపోర్ట్ చేయబోతున్నారని కమలం నేతలు చెబుతున్నారు. 

 

దుబ్బాక ఫలితం తర్వాత టీఆర్ఎస్ కు బలమైన ప్రత్యర్థిగా మారిపోయింది బీజేపీ, ఇప్పుడు భూపేంద్రయాదవ్ , గరికపాటి మోహన్ రావు వంటి ఉద్దండులను ఇంచార్జులుగా నియమించి గ్రేటర్ ఎన్నికల్లోనూ అధికార పార్టీకి సవాల్ విసురుతోంది.  దీంతో ఎన్నికల వ్యూహాల్లో దిట్టమైన ఆ ఇద్దరు బాహుబలులలను టీఆర్ఎస్ ఎలా ఎదుర్కొంటుదన్నది ఆసక్తిగా మారింది. బీజేపీ బాహుబలి వ్యూహాల ముందు కారు పార్టీ చిత్తవుతుందా లేద తట్టుకుని  నిలబడుతుందా చూడాలి మరీ...