బీజేపీకి ఇవాళ అగ్నిపరీక్ష

 

ఇవాళ దేశవ్యాప్తంగా 10 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అప్పుడప్పుడూ ఇలాంటి ఎన్నికలు సాధారణమే అనుకోండి. కానీ ఈ అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా జరుగుతున్న 4 లోక్‌సభ ఎన్నికల విషయంలో మాత్రం దేశం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అందుకు కారణాలు తెలియనివి కావు... కానీ ఓసారి గుర్తు చేసుకోవడంలో తప్పూ లేదు.

 

నాలుగు లోక్‌సభ స్థానాల్లో ముందుగా కైరానా గురించి చెప్పుకోవాలి. ఇక్కడి బీజేపీ లోక్‌సభ సభ్యుడు హుకుం సింగ్ మృతితో ఎన్నిక అనివార్యమైంది. హుకుం సింగ్‌కు హిందూ అతివాదిగా పేరుంది. పైగా అక్కడ జరుగుతున్న ఎన్నికలకి ప్రతిపక్షాలన్నీ కలిసి మరీ అభ్యర్థిని నిలబెట్టాయి. అసలే గోరఖ్‌పూర్‌లో జరిగిన ఉప ఎన్నిక ఓటమితో దిమ్మ తిరిగిపోయి ఉన్న యోగి ఆదిత్యనాధ్‌కు ఈ స్థానంలో గెలుపు చావోరేవోగా మారింది. ఇక్కడ కూడా ఓడిపోతే ఉత్తర్‌ప్రదేశ్‌లో ఆయన ప్రభ కొడిగడుతున్నట్లుగానే భావించాలి.

 

మహారాష్ట్రలోని పల్గర్‌ నియోజకవర్గంలో జరుగుతున్న లోక్‌సభ ఉప ఎన్నిక కూడా ఆసక్తికరంగానే ఉంది. పైకి మిత్రపక్షంలా కనిపిస్తున్నా... బీజేపీ మీద ఘాటైన విమర్శలు చేయడంలో ఈమధ్య శివసేన జంకడం లేదు. అందుకే పల్గర్‌లో బీజేపీ అభ్యర్థి మృతి వల్ల ఖాళీ ఏర్పడినప్పటికీ ఉప ఎన్నికలలో, మొహమాటం లేకుండా తన అభ్యర్థిని కూడా నిలబెట్టింది. ఈ స్థానంలో గెలవడం బీజేపీకి మాత్రమే కాదు... కాంగ్రెస్, ఎన్‌సీపీ, శివసేన పార్టీలకు కూడా అవసరమే!

 

మహారాష్ట్రలోనే ఉన్న భాంద్రా-గోడియా లోక్‌సభ ఎన్నిక కూడా ఆసక్తికరంగానే ఉంది. ఈ స్థానం కూడా ఒకప్పుడు బీజేపీదే. కానీ నానా పటోలే అనే లోక్‌సభ సభ్యుడు తన సొంత పార్టీ విధానాల మీదే తిరుగుబాటు బావుటా ఎగరేసి, తన స్థానానికి రాజినామా చేశారు. దాంతో ఇక్కడ ఉప ఎన్నిక అవసరం పడింది. ఇలా ఖాళీ అయిన స్థానాన్ని దక్కించుకునేందుకు ఎన్సీపీ మంచి పట్టుదలతో పావులు కదుపుతోంది.

 

నాగాలండ్‌లో ఉన్న ఒకే ఒక్క లోక్‌సభ స్థానానికి కూడా ఈరోజు ఉప ఎన్నిక జరుగుతోంది. అయితే ఈ పోరులో ఏదో ఒక స్థానిక పార్టీ మాత్రమే గెలిచే అవకాశం ఉంది.

 

అంటే బీజేపీ మూడు స్థానాలలో తన అభ్యర్థిని తిరిగి గెలిపించుకోవాల్సిన అగత్యం ఏర్పడింది. ఇప్పటికే పార్లమెంటులో బీజేపీ ప్రభుత్వం మైనారటీలో పడిపోయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ మూడు సీట్లు కూడా చేజారిపోతే బీజేపీ తన బలాన్ని నిరూపించుకోవాల్సిందిగా ప్రతిపక్షాలు ఒత్తిడి చేయవచ్చు. అలాంటి సందర్భాన్ని నివారించేందుకు బీజేపీ ముందస్తు ఎన్నికలకూ వెళ్లవచ్చు. పైగా ఉన్న స్థానాలను పోగొట్టుకోవడం అంటే ప్రజలు స్థానిక బీజేపీ పాలనలో తృప్తిగా లేరన్న సూచనను కూడా అందిస్తాయి. రాబోయే ఎన్నికల మీద ఈ ఫలితాలు తప్పకుండా ప్రభావం చూపుతాయి. ఇప్పటికే బీజేపా ఉప ఎన్నికలలో వరుసగా ఓడిపోతూ వస్తోంది. అలా ఓటములతో మూలుగుతున్న పార్టీ మీద కర్ణాటక తాటిపండు పడనే పడింది. ఇలాంటి పరిస్థితులలో మరో ఓటమి అంటే... అమిత్‌షా వ్యూహానికి అడ్డుపడినట్లే!