వజ్రాల వ్యాపారి బర్త్ డే పార్టీ,.. 20మందికి కరోనా పాజిటివ్

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన...

కరోనా వ్యాప్తిని అరికట్టడానికి భౌతిక దూరం పాటించాలని, మాస్క్ లు తప్పనిసరిగా ధరించాలని.. పార్టీలు, ఫంక్షన్స్ చేయవద్దని ప్రభుత్వం ఎంత చెప్పినా ప్రయోజనం లేదు. మాకెందుకు వస్తుంది అన్న ధీమా చాలామందిలో కనిపిస్తోంది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఇతరులు కూడా కరోనా బారిన పడుతున్నారు. దాంతో కరోనా రోగుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక సంఘటన ప్రజలకు కరోనా పై ఎంత మాత్రం భయం లేదన్న విషయం స్పష్టం చేస్తుంది.

హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ లో  ఒక బంగారు, వజ్రాల వ్యాపారి తమ పుట్టిన రోజు సందర్భంగా స్నేహితులు, బంధు మిత్రులతో కలిసి పార్టీ చేసుకున్నారు. నగరంలోని ప్రముఖ బంగారు వ్యాపారులు , రాజకీయ నాయకులు 150 మంది వరకు హాజరయ్యారు. అంతా బాగానే జరిగింది అనుకున్నారు. అయితే రెండు రోజుల క్రితం ఈ పార్టీకి హాజరైన ఒక బంగారు వ్యాపారి కరోనా వ్యాధితో చనిపోయారు. దాంతో పార్టీకి హజరైన మిగతవారిలో భయం మొదలైంది. వారంతా పరీక్షలు నిర్వహించుకోగా దాదాపు 20 మందికి పైగా కరోనా సోకినట్లు సమాచారం. 15 రోజుల కిందట జరిగిన ఈ పార్టీలో తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ కూడ పాల్గొనట్లు వినికిడి.