జీవిత కాలం సంపాదించిన ఆస్తిని దానంగా ఇచ్చేసిన అమెరికా కుబేరుడు

తరాలు తిన్నా తరగని ఆస్తి ఉన్నా ఇంకా వేల కోట్ల సంపాదన కోసం కక్కుర్తి పడే మహానుభావులు ఉన్న ఈ కాలంలో అమెరికా కు చెందిన ఒక పారిశ్రామికవేత్త ఏకంగా తన జీవితకాలం కష్టపడి సంపాదించిన 58 వేల కోట్ల ఆస్తిని గుప్త దానంగా ఇచ్చేసారు. అమెరికాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, విమానాశ్రయాల్లో ఉండే "డ్యూటీ ఫ్రీ షాపర్స్" సహ వ్యవస్థాపకుడు చార్లెస్ చక్ ఫీనీ తనకున్న యావదాస్తిని గుప్త దానం చేసేశారు. ప్రస్తుతం అయన ఆస్తి మొత్తం విలువ 58 వేల కోట్ల రూపాయలు. 2012లోనే ఈ మొత్తాన్ని ఆయన తన స్వచ్ఛంద సంస్థ "అట్లాంటిక్‌ ఫిలాంత్రోపీస్‌" ద్వారా దానం చేయనున్నట్టు ప్రకటించారు. అయన ఇలా దానంగా ఇచ్చిన దానిలో సగ భాగాన్ని విద్య కోసమే అందించారు. మిగిలిన దానిని మానవ హక్కులు, సామాజిక మార్పులు, ఆరోగ్య సమస్యలు వంటి అంశాల్లో తోడ్పడేందుకు దానంగా ఇచ్చారు. ఈ నెలతో ఆయన దానాలు పూర్తైపోవడంతో.. ఈ నెల 14న ఫీనీ స్వచ్ఛంద సంస్థ ప్రయాణం కూడా ముగిసింది. పదవీ విరమణ తర్వాత అయన తన భార్యతో కలిసి జీవించేందుకు కేవలం రూ.14కోట్లనే ఉంచుకుని, మిగిలిన మొత్తాన్ని వివిధ స్వచ్ఛంద సంస్థలకు దానమిచ్చేశారు.

 

ఈ సందర్భంగా ఫీని మాట్లాడుతూ.. తన జీవితంలో చాలా నేర్చుకున్నానని, అయితే తాను బతికి ఉండగానే ఈ మంచి కార్యక్రమం పూర్తయినందుకు తనకు చాలా సంతోషంగా ఉందని అయన ఫోర్బ్స్‌ పత్రికతో వ్యాఖ్యానించారు. ఒకప్పుడు 58వేల కోట్ల ఆస్తిని కలిగిన ఈ అపర కుబేరుడు ప్రస్తుతం శాన్‌ఫ్రాన్సిస్కోలో ఒక మామూలు అపార్ట్‌మెంట్ లో తన భార్యతో కలిసి ఓ మధ్యతరగతి వ్యక్తి లాగా విశ్రాంత జీవితాన్ని గడుపుతుండటం మరో విశేషం. ప్రపంచ కుబేరుల జాబితాలో స్థానం సంపాదించి అనేక దాతృత్వ కార్యక్రమాలు చేపడుతున్న బిల్‌ గేట్స్‌, వారెన్‌ బఫెట్‌ ఇద్దరూ కూడా తమ దాతృత్వం వెనుక స్ఫూర్తి ఫీనీయే అని చెప్పడం విశేషం. "మేము సంపాదించిన అపార సంపదను దానం చేసేందుకు చక్‌ మాకు ఓ దారిని ఏర్పరిచాడు. మన ఆస్తిలో సగం కాదు, యావదాస్తిని దానం చేయాలంటూ తను నాతో పాటు ఎంతోమందిలో స్ఫూర్తిని నింపాడు’’ అని బిల్‌ గేట్స్‌ పేర్కొన్నారు.