బీజేపీలో బీహార్ గడబిడ



విజయానికి బోలెడంతమంది తండ్రులు... అపజయం మాత్రం ఎవరూలేని అనాథ... ఈ జీవిత సత్యం బీహార్ ఎన్నికల తర్వాత బీజేపీలో కూడా మరోసారి రుజువవుతోంది. 2014  సాధారణ ఎన్నికలలో బీజేపీ సాధించిన విజయం మోడీ కారణంగానే లభించిందన్న అభిప్రాయాలు దేశమంతటా వున్నాయి. అయితే బీజేపీలో వున్న కొంతమంది నాయకులకు మాత్రం ఆ విషయాన్ని ఒప్పుకోవడానికి అహం అడ్డువచ్చింది. అందరి కృషి వల్లనే అప్పుడు విజయం సాధించామని గొణుక్కున్నారు. బీజేపీలో మోడీయిజం పెరిగిపోయిన తర్వాత పక్కన కూర్చోవాల్సి వచ్చిన కొంతమంది నాయకులకు బీహార్ ఎన్నికలలో బీజేపీ పరాజయం తర్వాత మంచి అవకాశం లభించింది. ఇప్పుడు వారందరూ తెరమీదకి వచ్చి మోడీని టార్గెట్ చేస్తున్నారు. ప్రస్తుతం పార్టీలో నిరాదరణకు గురయినట్టు భావిస్తున్న కురువృద్ధుడు అద్వానీని అండగా తీసుకుని మోడీ మీద వాగ్బాణాలు విసురుతున్నారు. మోడీ పరిపాలన తీరు కారణంగానే బీహార్ పరాజయం మూటగట్టుకోవాల్సి వచ్చిందని దెప్పిపొడుస్తున్నారు.

ఇదిలా వుంటే, మరో వర్గం మోడీని కాపాడటానికి ప్రయత్నాలు చేస్తోంది. బీహార్ ఎన్నికలలో బీజేపీ ఓడిపోవడానికి మోడీ ఎంతమాత్రం కారణం కాదని నొక్కి వక్కాణిస్తున్నారు. ఈ పరాజయాన్ని ఏ ఒక్కరి అకౌంట్లో వేయడం మంచిది కాదని అంటున్నారు. బీహార్ ఎన్నికల ఫలితాలు మోడీ ప్రభుత్వ తీరుకు రెఫరెండం ఎంతమాత్రం కాదని మొత్తుకుంటున్నారు. ఇలా బీజేపీలోని మోడీ వ్యతిరేక వర్గం, అనుకూల వర్గం మధ్య ముసుగులో గుద్దులాటలు భారీ స్థాయిలో జరుగుతున్నాయి. ఇది బీజేపీలో గడబిడకు కారణమైంది. బీహార్ ఓటమి అవమానాన్ని దిగమింగుకునే వరకూ బీజేపీలో ఈ గడబిడ తగ్గకపోవచ్చని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu