అగ్గి మీద గుగ్గిలం అయిన మిస్టర్ కూల్ సీఎం.. సంగతేంటంటే...  

మిస్టర్ కూల్ సీఎం గా పేరు తెచ్చుకున్న నితీశ్ కుమార్ ఈ మధ్య మండి పడుతున్నారు. తాజాగా అయన ఒక్క సారిగా సహనం కోల్పోయి.. మీడియాపై చిందులు తొక్కారు. ఇందుకు కారణం.. ఒక రిపోర్టర్ అడిగిన ఒకే ఒక ప్రశ్న. ఇండిగో ఎయిర్ లైన్స్ మేనేజర్ రూపేశ్ కుమార్ సింగ్ హత్య విషయంలో ఒక మీడియా రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సీఎం నితీశ్ ఒక్కసారిగా తన సహనం కోల్పోయారు. "మీ దగ్గర ఏవైనా ఆధారాలు ఉంటే, దయచేసి పోలీసులతో పంచుకోండి. నేరాన్ని రుజువు చేయడంలో వారికి సహాయపడండి. మీరంతా చాలా గొప్పవారు. నేను సూటిగా అడుగుతున్నా. అసలు మీరెవరికి మద్దతిస్తున్నారు చెప్పండి?’’ అని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అదే సమయంలో అయన పరోక్షంగా లాలూ, రబ్రీదేవీ పాలనపై కూడా తీవ్రంగా మండిపడ్డారు. ‘‘పదిహేనేళ్లు వారు పాలించారు. భార్యా భర్తల పాలనలో ఎన్నో నేరాలు జరిగాయి. వాటినెందుకు మీరు హైలెట్ చేయరు?’’ అని సూటిగా ప్రశ్నించారు.

 

ఇది ఇలా ఉండగా ఇండిగో ఎయిర్ లైన్స్ మేనేజర్ రూపేశ్ కుమార్ హత్య సాక్షాత్తు సీఎం నితీశ్ నివాసానికి సమీపంలోనే జరగడంతో దీనికి రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. అయితే మీడియా అడిగిన ప్రశ్న పూర్తిగా తప్పని, పూర్తిగా నిరాధారమని అయన మండిపడ్డారు. ఓ హత్య జరగడానికి పలు ప్రేరేపణలు ఉంటాయని, వాటికి గల కారణాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని నితీష్ అన్నారు.