దొరకని కేసీఆర్ అపాయింట్మెంట్..కాంగ్రెస్ వైపు అడుగులు

 

తెలంగాణ రాజకీయాల్లో కాకా గా గుర్తింపు పొందిన నేత జి.వెంకటస్వామి.కాంగ్రెస్‌లో దశాబ్దాల పాటు ఉండి.. ఆ కాంగ్రెస్‌ నేతగానే చనిపోయిన దిగ్గజం. అలాంటి కాకా కుమారులు ఇద్దరూ కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య అటూ ఇటూ జంపింగ్ చేస్తున్నారు.తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సమయంలో వినోద్, వివేక్ 2013 జూన్ 2వ తేదీన కాంగ్రెసును వీడి టీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు ఆమోదం పొందిన తర్వాత 2014 ఏప్రిల్ ఎన్నికలకు పక్షం రోజుల ముందు తిరిగి కాంగ్రెస్ లో చేరారు.వినోద్ చెన్నూరు శాసనసభ నియోజకవర్గానికి, వివేక్ పెద్దపల్లి పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. తిరిగి 2016లో టిఆర్ఎస్ లో చేరారు. ఈ నేపథ్యంలో వివేక్ కు ప్రభుత్వ సలహాదారు పదవి లభించింది. 

రానున్నఎన్నికల్లో వినోద్‌కు చెన్నూరు అసెంబ్లీ టికెట్, వివేక్‌కు పెద్దపల్లి లోక్‌సభ టికెట్ ఇవ్వడం లాంఛనమే అని అంతా భావించారు. కానీ చెన్నూరు టికెట్ పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ కేటాయించారు.దీనిపై కేసీఆర్ ని కలవటానికి ప్రయత్నిస్తున్న ఈ సోదరులకు అపాయింట్మెంట్ కూడా దొరకట్లేదని తెలుస్తుంది.మరోవైపు అసంతృప్త నాయకులను బుజ్జగిస్తున్న కేటీఆర్ ను కలిసి మంతనాలు జరిపారు.తన సోదరునికి చెన్నూరు టికెట్ ఇస్తే తాను పెద్దపల్లి లోక్ సభ స్థానం వదులుకోవడానికి అయినా సిద్ధమని కేటీఆర్ కి వివేక్ తెలిపారట.కానీ కేటీఆర్ మాత్రం అభ్యర్థులను మార్చటం కుదరదు అని తేల్చిచెప్పేశారని తెలుస్తుంది.దీంతో అసహనానికి గురైన సోదరులు పార్టీ మారే యోచనలో ఉన్నారని,మారితే తిరిగి కాంగ్రెస్ పార్టీలోనే చేరతాని సమాచారం.ఒకవేళ ఇద్దరు పార్టీ మారితే టీఆర్ఎస్ కు పెద్ద షాక్ తగిలినట్లే