రాష్ట్ర రాజకీయ నేతల వితండ వాదన

 

నేడు కేంద్రం రాష్ట్ర విభజనపై తుది నిర్ణయం తీసుకోనున్న తరుణంలో రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు ఒక సరికొత్త వితండ వాదన అందుకొన్నాయి. అదేమంటే రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకొనే హక్కు ఉత్తరాది నేతలకు ఎవరిచ్చారు? అని. ఆంధ్రప్రదేశ్ గురించి ఏమాత్రం అవగాహన లేని ఉత్తరాదినేతలందరూ కలిసి రాష్ట్ర భవిష్యత్ నిర్ణయించడం ఏమిటని ముక్త కంఠంతో ప్రశ్నిస్తున్నారు. నిజమే, వారి వాదన సహేతుకమే. అయితే వారికి ఆ అవకాశం ఎవరు ఇచ్చారు? అని ప్రశ్నించుకొంటే మన ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలేనని చెప్పవలసి ఉంటుంది.

 

రాష్ట్ర విభజనపై ఉద్యమం మొదలయినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాలే చూసుకోన్నాయి తప్ప, ఎ ఒక్క పార్టీ కూడా విజ్ఞత కనబరచి రాష్ట్రంలో ఇరు ప్రాంతాల మేధావులను సమావేశ పరచి సమస్యను రాష్ట్ర స్థాయిలోనే పరిష్కరించుకొనే ప్రయత్నం చేయలేదు. నిజానికి రాష్ట్ర స్థాయిలోనే పరిష్కరించుకొనవలసిన ఈ సమస్యను కాంగ్రెస్, తెరాసలు తమ స్వలాభం కోసం సమర్ధంగా పెంచి పోషిస్తే, మిగిలిన రాజకీయ పార్టీలు తమవంతుగా తలో పుల్ల వేస్తూ ఆ మంటను మరింత ఎగదోసాయి. తత్ఫలితంగానే ఈ సమస్య ఆంధ్రప్రదేశ్ గురించి ఏమాత్రం అవగాహన లేని ఉత్తరాది నేతల చేతుల్లోకి వెళ్లిపోయింది. అందుకే నేడు వారు రాష్ట్ర విభజనపై సాధికారంగా మాట్లాడుతుంటే, మన రాజకీయపార్టీలు, వాటి నేతలు ఇప్పుడు మా రాష్ట్రం మీద ఉత్తరాదివారి బోడి పెత్తనం ఏమిటని మండి పడుతూ వితండ వాదనలు చేస్తున్నారు.

 

రాష్ట్ర సమస్యను రాష్ట్ర రాజకీయపార్టీలు పరిష్కరించుకొనే తెలివిడి, ఐక్యాత, శ్రద్ధ లేకపోవడం వలననే వారు ఇందులో వేలు పెట్టె అవకాశం కలిగింది. అందుకు వారిని నిందించడం కంటే మన తెలివి తక్కువతనాన్ని మనమే నిందించుకోవడం మేలు. రాష్ట్ర విభజన సమస్యతో యావత్ తెలుగుజాతి ఆత్మగౌరవం డిల్లీ నేతల కాళ్ళ ముందు పెట్టి పరువు తీసుకొన్నతరువాత ఇక పోయిన ఆత్మగౌరవం గురించి బాధపడటం ఎందుకు?

 

పరిస్థితి ఇంత వరకు వచ్చిన తరువాత ఉత్తరాది, దక్షినాది అంటూ మరో సరికొత్త వాదన మొదలుపెట్టడం వలన కొత్తగా ఒరిగేదేమీ లేకపోయినా వారికి మనపట్ల వారికేర్పడిన చులకన భావం మరింత పెరిగే అవకాశం ఉంది. అందువల్ల ఇటువంటి వితండ వాదనలు చేయడం మానుకోని కనీసం ఇక మిగిలున్నపరువునైనా కాపాడుకోగలిగితే అదే పదివేలు.