రాష్ట్ర విభజనపై పార్టీల వికృత రాజకీయ క్రీడలు-1

 

ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉన్నరాష్ట్ర విభజన, తెలంగాణా ఏర్పాటు అనే రెండు అంశాలు అన్ని పార్టీలకు ఒక రాజకీయ క్రీడగా మారిపోయింది. ఈ వ్యవహారంలో ప్రతీ పార్టీ కూడా తాము ఈ అంశాల నుండి ఏవిధంగా రాజకీయ లబ్ది పొందగలము? ఈ సమస్యల నుండి బయటపడి, వైరి పక్షాలను దెబ్బతీయాలని వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తూ రాజకీయ చదరంగం ఆడుకొంటున్నాయి.

 

ఇది ప్రజల భావోద్వేగాలతో చెలగాటమేనని వాటికీ తెలుసు. గనుకనే ఆ భావోద్వేగాలను కూడా తమ రాజకీయ లబ్ధికి నేర్పుగా ఉపయోగించుకోవాలని చూస్తున్నాయి. రాజకీయ పార్టీల ఈ వికృత క్రీడ వలననే సమస్య మరింత జటిలమవుతోంది.

 

ఇందులో మొట్ట మొదటి దోషి కాంగ్రెస్ పార్టీయే. ఇంతటి క్లిష్టమయిన, సున్నితమయిన అంశాన్ని,సరిగ్గా ఎన్నికల ముందు మొదలుపెట్టడమే దాని ఆలోచన ఏమిటో స్పష్టం అవుతోంది. అయితే అది వరుస పెట్టి చేస్తున్నతప్పుల వలన అది ఆశించిన ప్రయోజనం దక్కకపోగా, రాష్ట్రం నుండి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి చేజేతులా కల్పించుకొంటోంది.

 

తన మద్దతు ఉంటే తప్ప కాంగ్రెస్ గట్టెకలేదనే సంగతి కనిపెట్టిన బీజేపీ కూడా మాట మార్చిందిప్పుడు. బీజేపీ తెలంగాణా బిల్లుకి మద్దతు ఇవ్వకపోతే రాష్ట్ర ఏర్పాటుకి అవకాశం లేదని గ్రహించిన కేసీఆర్ కూడా మాట మర్చితెరాస వచ్చే ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేస్తుందని చెపుతున్నాడు.

 

ఎందుకంటే కాంగ్రెస్ తెలంగాణా ఇచ్చినా ఇవ్వకున్నా తెరాసకు వచ్చేనష్టం ఏమీ లేదు. తెలంగాణా ఏర్పాటయితే సానుకూల ఓటుతో గెలవగలదు. లేకుంటే తెలంగాణా సెంటిమెంటుతో గెలవగలదు. కానీ ముందుగా పోయేది మాత్రం కాంగ్రెస్ పార్టీయే.