రాష్ట్ర విభజనపై రోజుకో కొత్త ముడి

 

రాష్ట్ర విభజన అంశం కంటే, ఇరుప్రాంతల నేతలు చేస్తున్నవివాదస్పద వ్యాఖ్యల వలన ఇప్పటికే జటిలంగా ఉన్నఈ సమస్య క్రమేపి మరింత జటిలంగా మారుతోంది.

 

ఇరుప్రాంతల నేతలు తమ రాజకీయ మైలేజి పెంచుకోవడానికో, తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికో లేకపోతే తాము తమ ప్రజల, ప్రాంతం మేలుకోరుతూ వీర పోరాటం చేస్తున్నామని చాటుకొనే ప్రయత్నంలోనో లేక వేరే ఇతర కారణాలతోనో చేస్తున్న చిన్నచిన్న వ్యాఖ్యలు, విమర్శలు, డిమాండ్స్ పై, రెండోవైపు వారు తీవ్రంగా స్పందిస్తుండటంతో ప్రతీ అంశం కూడా ఇప్పుడు పరిగణనలోకి తీసుకోవలసి రావడంతో రాష్ట్ర విభజన ఊహించిన దానికంటే ఇంకా చాలా క్లిష్టంగా మారుతోంది. కానీ, తాము ఆ విధంగా స్పందించకపోయినట్లయితే కేంద్రం ఎదుటవారిని మంచి చేసుకొనే ప్రయత్నంలో వారికి ఆయాచితంగా అన్నీఇచ్చేసి తమ ప్రాంతానికి అన్యాయం చేస్తుందనే భయం వల్ల కూడా అందరూ తలో రాయి వేస్తూ క్లిష్టమయిన విభజన అంశాన్ని మరింత క్లిష్టంగా మార్చుతున్నారు.

 

అయితే, ఈ విషయంలో వారికంటే ముందు కాంగ్రెస్ అధిష్టానాన్నే ఎక్కువ తప్పు పట్టవలసి ఉంటుంది. ఒకసారి తెలంగాణా ప్రాంతం వారిని, మరోసారి సీమాంధ్ర ప్రాంతం వారిని మంచి చేసుకొనే ప్రయత్నంలో రోజుకో కొత్త ప్రతిపాదన చేస్తూ ఇరు ప్రాంతాల ప్రజలలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

 

ఇంతవరకు రాష్ట్ర విభజనలో జలవనరులు, ఉద్యోగాలు, హైదరాబాద్ అంశాలే క్లిష్టమయినవిగా అందరూ భావిస్తూ వచ్చారు. కానీ, ఇప్పుడు వాటికి కొత్తగా భద్రాచలంపై ఎవరికి హక్కులు ఉండాలనే అంశం కూడా వచ్చి జేరింది. అంటోనీ కమిటీ హైదరాబాదు ఆదాయంపై పదేళ్ళపాటు ఇరుప్రాంతాలకి జనాభా ప్రాతిపదికన హక్కులు ఉండాలని ప్రతిపాదించడంతో సహజంగానే తెలంగాణా నేతలలో వ్యతిరేఖత మొదలయింది.

 

ఈవిధంగా రోజుకొక కొత్త అంశంపై తెరపైకి తెస్తూ దానిపై పీట ముడులు వేసుకొంటూ పోవడం వలన, తెలంగాణా ప్రక్రియలో మరిన్ని అడ్డంకులు పెరిగి చివరికి రాష్ట్ర ఏర్పాటు వాయిదాపడినా ఆశ్చర్యం లేదు. అదే జరిగితే, ఇక ఎన్నికల తరువాత కేంద్రంలో అధికారంలోకి వచ్చే కూటమిపై, అప్పటి రాజకీయ పరిస్థితులు, అవసరాలు, పొత్తులు, ఒత్తిళ్ళు వంటివి తప్పక ఉంటాయి గనుక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటులో మరింత జాప్యం జరుగవచ్చును.

 

రాష్ట్ర విభజన వ్యతిరేఖిస్తున్న సీమాంధ్ర ప్రజలు, నేతలు ఇందుకు సంతోషించవచ్చును. కానీ, తెలంగాణా ప్రజలకు మాత్రం తీవ్ర నిరాశ కలిగిస్తుంది. గనుక తెలంగాణా కాంక్షిస్తున్న నేతలు మీడియా ముందు కొంత సంమయనం పాటించుతూ, తమ అధిష్టానంతో నేరుగా మాట్లాడటం మేలేమో.