ఎన్నికలలోగా రాష్ట్ర విభజన సాధ్యమేనా

 

యుపీయే ప్రభుత్వం రాష్ట్ర విభజన కోసం మెల్లగా అడుగులు ముందుకు వేస్తోంది. ఆ ప్రయత్నంలో భాగంగా ఏడుగురు మంత్రులతో కూడిన మంత్రుల బృందాన్ని నియమించడం, వారు నిన్నతొలి సమావేశం అవడం కూడా జరిగింది. అయితే మంత్రుల బృందం తమ పని పూర్తి చేయడానికి ఇప్పుడు నిర్దిష్ట కాల వ్యవధిని తొలగించడంతో, వచ్చే ఎన్నికలలోగా రాష్ట్రవిభజన జరుగకపోవచ్చుననే ఒక సంకేతం వెలువడింది.

 

ఒకవేళ వారు చకచకా తమ పనులు చక్కబెట్టి నివేదికను ప్రభుత్వానికి సమర్పించినప్పటికీ, అందులో వారు సూచించిన సలహాలను కేంద్ర ప్రభుత్వం ఆమోదించినప్పటికీ, సాధారణ ఎన్నికలకి కేవలం ఆరు నెలల సమయం మాత్రమే మిగిలి ఉన్నందున, ప్రభుత్వం వాటిని అమలు చేయలేదు.

 

సాధారణ ఎన్నికలు వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలోనే జరుగుతాయని అనుకొన్నా, దానికి రెండు లేదా మూడు నెలల ముందు ఎన్నికల షెడ్యుల్ మరియు నోటిఫికేషన్ విడుదల అవుతుంది. అప్పుడు బహుశః జనవరి లేదా ఫిబ్రవరి నెలలోనే ఎన్నికల కోడ్ అమలులోకి రావచ్చును. అంటే ప్రభుత్వానికి ఉన్న సమయం ఇంకా కుచించుకుపోయి, మహా అయితే మరో రెండు లేదా మూడు నెలల సమయం మాత్రమే మిగిలి ఉంటుందని అర్ధం అవుతోంది. ఒకసారి ఎన్నికల కోడ్ అమలులో వచ్చిన తరువాత, ప్రభుత్వం రాష్ట్ర విభజన విషయంలో అడుగు ముందుకు వేయలేని పరిస్థితి ఏర్పడుతుంది.

 

గనుకనే మంత్రుల బృందానికి కాలపరిమితి తొలగించినట్లు భావించవచ్చును. అందుకే షిండే పార్లమెంటు శీతాకాల సమావేశాలలో తెలంగాణా బిల్లు పెట్టడం గురించి సమాధానం చెప్పకుండా సమాధానం దాట వేసారు. తెలంగాణా రాష్ట్రం ఎన్నికల ముందు ఏర్పడుతుందో లేక తరువాత ఏర్పడుతుందో ఇప్పుడే చెప్పలేమని ఏఐసీసీప్రతినిధి పీ సీ చాకో అనడం కూడా అందుకే అయి ఉండవచ్చును.